స్కాంద పురాణము

, , 3 comments

పూర్వము కైలాస పర్వతము మీద శంకరుడు బ్రహ్మాది దేవతలో కొలవైయుండి, యీ స్కాందపురాణమును వారికి వినిపించెను. పార్వతి అది విని కుమారస్వామికి (స్కందునకు) చెప్పెను. ఆయన నంది గణమునకు చెప్పెను. నంది దత్తాత్రేయునకు జెప్పెను. ఆయన వ్యాసనునకు జెప్పెను. వ్యాసుడు దానిని సూతునకు జెప్పెను. ఆయన శానకాది మునులకు జెప్పెను. తత్పురుష కల్పములో, సర్వసిద్ధులను సమకూర్చెడి మహేశ్వర ధరమములు కుమారస్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడినది. అవి అన్నియు ఒక పురాణమై వెలసినవి. స్కందునిచే చెప్పబడిన పురాణము కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ధికెక్కెను.

చంద్రాంగదుడు - సోమవార వ్రతము.....
నలదమయంతుల కుమారుడు ఇంద్రసేనుడు. అతనికి చంద్రాంగదుడను కుమారుడుండెను. అతడు సమస్త విద్యాకుశలుడై యువరాజ్య పట్టాభిషిక్తుడయ్యెను. అతనికి చిత్రకర్ముడను రాజు తన కుమార్తె సీమంతిని నిచ్చి పెండ్లి చేసెను. చంద్రాంగదుడు అత్తవారింట్లో కొన్నాళ్లుండెను. ఒకనాడు యమునానదిలో నౌకావిహారము చేయుటకై మిత్రులతో వెళ్లెను. పెద్దగాలి విసరి పడవ తిరుగబడి అందరును నీళ్ల పాలైరి. చిత్రకర్ముడు చంద్రాంగదునికై వెదకించెను. లాభము లేకపోయినది. విచారముతోఇంటికి బోయి, కుమార్తెకు అలంకారములన్నియు తీసివేసెను. ఆమె వితంతు వేషముతో నుండెను.
ఆమెను జూచి మైత్రేయి అను మునిపత్ని, "పరమశివుని ఉద్దేశించి సోమవార వ్రతమును దీక్షతో చేయుము. నీకు శుభములు గలుగు"నని బోధించి, ఆమెకా వ్రతము చేయు విధానము చెప్పి వెళ్లెను. ఆమె ఆ సోమవార వ్రతము చేయనారంభించెను. (సోమ: ఉమయాసహిత: శివ: పార్వతితో కూడిన శివుని సోముడందురు. అతనికి ఇష్టమైనది సోమవారము. ఆనాడు అతనికి గూర్చిచేయు వ్రతము.) చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకము చేరెను.

ఇతనిని తెచ్చిన నాగకన్యలు తక్షకు నెదుట నిలువబెట్టిరి. తక్షకుడతనిని జూచి "నీవెవరి కుమారుడువు? ఎందుకీ లోకమునకు వచ్చితిని?" అని యడుగగా, రాజకుమారుడు, తాను నిషధదేశాధిపతియైన నలునిపౌత్రుడననియు యమునలో నౌకవిహారము చేయుచు ప్రమాద వశమున నటిలో మునిగి యా లోకమునకు వచ్చితిననియు, తక్షకునివంటి మహాత్ముని దర్శనము వలన ధన్యుడనైతి ననియు తన కథ వినిపించెను. తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన యింట కొన్నాళ్లుండుమనెను.

చంద్రాంగదుడు, "ఇప్పటికే నావారందరును నన్ను చచ్చినవారిలో లెక్కవేసి యుందురు. నేను వెళ్లి నా తల్లిదండ్రులకును, నా భార్యకును, అత్తమామలకును సంతోషము గలిగింపవలెను. కావున త్వరలో నాకు సెలవిచ్చి నా లోకమునకు పంపు"డని కోరెను. ఆయన అనేకములైన కానుకలిచ్చి, అవి మోయుటకు ఒక రాక్షసుని, మిత్రుడుగా ఒక నాగయువకుని తోడిచ్చి పంపెను. ఈతదంగముజరుగు లోపక, భూలోకములో మూడేండ్లు గడచెను. ఈలోగా ఇతని తండ్రిని శత్రువులు చెరలో బెట్టి రాజ్యమాక్రమించిరి.

చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చెను. అతని భార్య వితంతు వేషముతో శివాలయమునకు వచ్చెను. ఆమెను జూచి యెక్కడో చూచినట్లున్న దనుకొని "నీ వెవరు? ఇట్లుండుటకు కారణమే" మనగా.. ఆమె, తన వృత్తాంతము చెప్పెను. ఆమె తన భార్యయని తెలుసుకొని, "నీ భర్త మూడు నాలుగు రోజులలో వచ్చును. నేనతని మిత్రుడను" అని చెప్పి తన పురమునకు వెళ్లి కోటముందు నిలబడి, శత్రురాజులనుద్దేశించి "మీకు ప్రాణముల మీద ఆశ యున్నచో ఉన్నపాటున నగరము విడిచిపొండు.

నేను నలుని మనుమడను. చంద్రాంగదుడను. తక్షకుని వల్ల వరములు పొంది వచ్చినాడను. నా మాటలు లెక్కచేయనిచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మము చేసెద"నని చెప్పెను. శత్రురాజు వచ్చిచూచి, రాజకుమారుని ధైర్యసాహస పరాక్రమాదులకు భయపడి, అతని రాజ్యమును విడిచి వెళ్లిపోయెను. చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెరనుండి విడిపించి, తన కథను వినిపించెను. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమముగా వచ్చినాడని వార్తనంపెను.

అతడు బ్రహ్మానందము నొంది కుమార్తెతో.. "తల్లీ! నీవు చేసిన సోమవారవ్రతము ఫలించినది. నీ భర్త తిరిగి వచ్చినాడు" అని చంద్రాంగదుని తీసుకొని వచ్చి తన కూతురును మరల పెండ్లికూతురును జేసి చంద్రాంగదుని కిచ్చి మహావైభవముతో పెండ్లి చేసెను. అతడు సీమంతినితో గలసి సోమవారవ్రతము నియమముగా జేయుచు పదివేలేండ్లు రాజ్యపాలన చేసి శంకరుని అనుగ్రహమును బొందెను.

సోమవార వ్రత మహిమ - 

విదర్భ దేశములో వేదమిత్రుడు, సారస్వతుడు అను బ్రాహ్మణు లిద్దరుండిరి. వారు ప్రాణమిత్రులు. వేదమిత్రుని కొడుకు సుమేధుడు. సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరు కూడా మిత్రులై ఒకే గురువు దగ్గర సమస్త విద్యలను అభ్యసించి పండితులైరి. వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చెను. వేదమిత్ర సారస్వతులు ధనవంతులు కారు.

అందుచేత కొడుకులతో "మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనము సంపాదించుకొని రండు" అని పంపిరి. వారు వెళ్లి రాజదర్శనము చేసి, తమ పాండిత్యప్రకర్షను ప్రదర్శించిరి. ఆ రాజు మీకేమి కావలెనని యడిగెను. వివాహము చేసుకొని సంసారము గడుపుకొనవలెను గాని, మా విద్వత్తును మెచ్చుకొన్నచో తగిన బహుమాన మిప్పింపుడని వారడిగిరి. రాజునకు, రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చెను. "మీలో ఒకరు ఆడ వేషము వేసుకొని, మీరు భార్యాభర్తల వలె నటించుచు, నిషధ రాజైనచంద్రాంగదుని యొద్దకు వెళ్లుడు. ఆయన భార్య సీమంతిని మహాశివభర్తురాలు.

సోమవారమునాడు వ్రతము చేయుచు దంపతీపూజ చేసి అపరిమితమైన ధనములను కానుకగా వచ్చును. వెళ్లి తెచ్చికొనుడు. మీ దారిద్ర్యము తీరిపోవు"ననెను. వారు కపటకృత్యమునకు భయపడుచుండగా "ఇదిరాజాజ్ఞ. తప్పకుండా పాలింపవలసినదే. పొండు" అని అంత:పుర పరిచారికలను బిలిచి సామవంతునికి ఆడవేషము వేయించి పంపెను. వారు సంకోచించుచునే చంద్రాంగదుని భార్య చేయు వ్రతమునకు దంపతులుగా వెళ్లిరి. ఆమె వీరిని చూసి, నిజము గ్రహించి నవ్వుకొని, పీఠముపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి సమస్తోపచారములతో యథావిధిగా పూజించెను.

షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగానిచ్చి సాగనంపెను. వారు తిరిగి వచ్చుచుండగా దారిలో సామవంతుడు సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టెను. సుమేధుడు, "ఏమిరా! నిజముగా ఆడదానివలె మాట్లాడుచున్నావేమి? నీవు మగవాడవు. అది గుర్తుంచుకొని మసలుము" అనగా సామవంతుడు "నేను ఇప్పుడు మగవాడనుగాను. స్త్రీనైపోతిని. నీవునాకు నచ్చినావు. నాతో విహరింపు"మనెను. సుమేధుడాశ్చర్యపడి ఆమెను నిశితముగా చూచెను.

సామవంతుడు నిజముగా స్త్రీమయ్యెను. సుమేధుడు "నీవు నిజముగా స్త్రీవైనచో, నీ తండ్రి నాకు నిన్నిచ్చినచో మనము దంపతుల మగుదము. పోవుదము రమ్మ"ని ఇంటికి దెచ్చెను. విషయము తెలిసి వేదమిత్ర సారస్వతులాశ్చర్యపడిరి. సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీయైనందుకు విచారించుచు రాజువద్దకు బోయి, "నీ ధూర్తత్వము వలన నా కొడుకు స్త్రీగా మారినాడు. నాకు వంశాభివృద్ధి చేయు నా కుమారుని నీ విట్లు చేసినావు. రాజులకిట్టి పరాచికములు తగునా" యని పలికెను. రాజు, అతడు నిజముగా స్త్రీగా మారెనని తెలిసికొని, సోమవారవ్రత మహాత్మ్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపము నొంది, వీరందరితో కలిసి దేవాలయమునకు వెళ్లి నియమముతో నిరాహారుడై మూడు దినములు జగన్మాత నారాధించెను.

దేవి ప్రత్యక్షము కాగా, రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి తన యపరాధమును మన్నింపుమని ప్రార్థించి, "తల్లీ! ఈ స్త్రీగా మారిన యునవకుని మరల పురుషునిగా జేయు"నని యడిగెను. ఆ తల్లీ.. "రాజా! నా భక్తురాలి భావనను మార్చు శక్తి నాకు లేదు. ఈమె సుమేధునికి భార్యయగును. సారస్వతునికి వంశోద్ధారకుడైన కుమారుడు కలుగును" అని వరములిచ్చెను. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు పెండ్లి చేసెను. అతనికి తరువాత ఒక కొడుకు పుట్టెను.

భద్రాయుపు చరిత్ర : 

పూర్వం అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. అతడు కులధర్మాన్ని విడిచిపెట్టి వేశ్యాలోలుడై వున్నాడు. ఒకనాడు ఆ వేశ్యా ఇంటికి ఋషభుడు అనే ఒక యోగి వచ్చాడు. వేశ్య అయిన బ్రాహ్ముణుడు ఆయనకు పరమభక్తితో సేవలు చేసి, పిండివంటలు వండబెట్టి, భోజనం పెట్టి పరిచర్యలు చేశారు. ఆయన వారిని దీవించి వెళ్లిపయాడు. కాలాంతరం తరువాత బ్రాహ్మణుడు మరణించి దశార్ణదేవరాజు భార్య కడుపున పుట్టాడు. ఆమె సవతులు ఆమెకు విషం ఇచ్చారు. అయినా ఆమె చావలేదు. నెలలు నిండగానే ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది.

సవతులు ఆమెకిచ్చిన విషప్రభావం వల్ల తల్లీకొడుకులకు దేహమునిండా వ్రణాలు పుట్టి పెద్దగా అయ్యాయి. రాజు దీని బారినుండి బయటపడడానికి ఎన్నో చికిత్సలు చేయించాడు. కాని అవి తగ్గలేదు. చివరికి రాజు విసిగిపోయి తల్లీకొడుకులను అడవిలో విడిచి పెట్టేస్తాడు. ఆ అడవులకు సమీపంలో ఒక నగరం వుండేది. ఆ నగరంలో సంపన్నుడైన పద్మాకరుడు వైశ్యుడు వుండేవాడు. ఈ పద్మాకరుడి దాసి ఒకతే వీరిని చూసి తన యజమాని దగ్గరకు తీసుకుని వెళ్లి, వారికి రక్షణ కల్పించమని ప్రార్థిస్తుంది. అతడు అంగీకరించి వారిని తన ఇంటిలోనే స్థావరం కల్పించి చికిత్స చేయిస్తూ వుంటాడు. ఒకనాడు వ్రణముల బాధతో రాకుమారుడు మరణిస్తాడు. కొడుక చావు బాధను తట్టుకోలేక రాజపత్ని కుంగిపోతుంది.

ఇలా రాజపత్ని ఏడుస్తుండగా.. శివయోగి ఋషభుడు వారింటికి వస్తాడు. అతడు రాజపత్నిని ఓదార్చినా ఆమె శాంతింపలేదు. అప్పుడు ఆ యోగి భస్మము ఆ బాలుడిపై చల్లి అతడ్ని బ్రతికిస్తాడు. తరువాత భస్మమంటిన చేతితో ఆ మాతాపుత్రల శరీరాలకు తాకుతాడు. దీంతో వారి మీద వున్న వ్రణములు పోయి ఆరోగ్యవంతులు అవుతారు. పద్మాకరునికి ఒక కుమారుడు వుంటాడు. అతడు, రాజకుమారుడు ప్రాణస్నేహితులుగా మెలిగి, గురువుల వద్ద తమతమ కులానికి సంబంధించిన విద్యలను భక్తిశ్రద్ధలతో అస్యసిస్తారు. ఒకనాడు ఋషభుడు ఆ రాకుమారుడి వద్దకు వస్తాడు.

అతడు చదివిన చదువులను పరీక్షించి తెలుసుకొని.. "నాయనా! నీకు శివారాధనము చేయు విధానము, శివకవచమును బోధిస్తాను. వానితో నువ్వు శంకరుని ఆరాధించు. నీకు సర్వత్రా జయం కలుగుతుంది" అని ధనుర్బాణములను, ఖడ్గములను ఇస్తాడు. భద్రాయువు (రాకుమారుడు) నియమనిష్టలతో పరమేశ్వరుడిని ఆరాధించడం మొదలు పెడతాడు. శివా తనను అనుగ్రహించడం వల్ల అతనికి అపూర్వశక్తులు లభిస్తాయి. ఇంతలో దశార్ణదేశరాజైన వజ్రబాహునిపై మాగధులు దండెత్తి వారిని ఓడించి, బంధించి రాజ్యాన్ని ఆక్రమిస్తారు.

ఆ సంగతి తెలుసుకున్న భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసుకొని వెళ్లి.. ఏకాంగ వీరుడై మగధులను రణమునకు బిలిచి తన పరాక్రమంతో విజృంభిస్తాడు. శివకవచం ప్రభావం వల్ల శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు ఇతనికి ఎటువంటి హానిని చేయలేకపోయాయి. అప్పుడతను వారినందరిని సంహరించి, శత్రురాజును బంధించి, సింహాసనాన్ని ఆక్రమిస్తాను. వెంటనే చెరసాలలో వున్న తన తల్లిదండ్రులను విడిపించి, ఆ సింహాసనం మీద తన తండ్రిని కూర్చోబెడతాడు.

వజ్రబాహుడు "నాయనా! నీవు ఎవరివో నాకు తెలీదు. కానీ, నువ్వు నాకు చేసిన ఈ మహోపకారానికి నేను, రాజ్యంలో వుండే ప్రజలందరూ నీకు ఋణపడి వుంటాం" అని చెబుతుండగా.. శివయోగి అక్కడికి వచ్చి "రాజా! నీ భార్యాపుత్రులను రోగగ్రస్తులని పూర్వంలో నీవు అడవిలో విడిచావుకదా... ఆ పుత్రుడే ఇతడు. నీ భార్య ఉత్తముడైన పద్మాకరుని రక్షణలో వుంది" అని చెబుతాడు. దాంతో ఆ రాజు తన కొడుకును ఆనందంతో కౌగిలించుకుంటాడు. రాణిని కూడా పిలిపించి, వారితో సుఖంగా తన జీవనాన్ని సాగిస్తాడు.

చంద్రాంగదుడు అనే రాజు భద్రాయయువు గుణగణాలను వినివుంటాడు. శివయోగి చంద్రాంగదునితో "నీ కుమార్తె కీర్తిమాలినికి యోగ్యుడైన వరుడు అతడే. కావున అతనికిచ్చి వివాహం చేయుము" అని చెబుతాడు. పూర్వజన్మలో వేశ్య అయివుండి కూడా శివయోగిని సేవించిన పుణ్యంవల్ల చంద్రాంగదునికి ఆమె కుమార్తెగా పుట్టింది. ఆ సంగతి తెలిసిన శివయోగి వారిద్దరిని కలిపి, వివాహం జరిపిస్తాడు.

ఒకనాడు భార్య కీర్తిమాలినితో కలిసి అరణ్యానికి విహరించడానికి వెళతాడు. అక్కడ ఒక బ్రాహ్మణ మిథునము వచ్చి రాజును దర్శించి వెళుతుంటుంది. ఆ సమయంలో వారిని ఒక పెద్దపులి తరుముకొని వస్తుంటుంది. అప్పుడు ఆ భయంతో వారు అక్కడినుండి పరుగులు తీస్తారు. అక్కడున్న భద్రాయువు పరుగెత్తి ఆ పులిని బాణములతో హరించడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆ పులి చలించదు. వివిధ శాస్త్రాలను ఉపయోగించి దానిని చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ అవేమీ పులిని హాని కలిగించవు. అక్కడున్న బ్రాహ్మణ స్త్రీని ఆ పులి చంపి, తినేస్తుంది.

బ్రాహ్మణుడు ఏడుస్తూ.. "రాజా! నువ్వు ప్రజలను కాపాడలేకపోయావు. నీ రాజరికం ఎందుకు? ఇప్పుడు నీముందే నా భార్య పులి నోటబడి మరణించింది. నాకు యజ్ఞాగ్ని హోత్రాదులు సాగుట ఎలా? అందుచేత నీ భార్యను నాకిచ్చి నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపో" అని అంటాడు. రాజు ఆశ్చర్యపడి... "ఓయ్ బ్రాహ్మణా! నీకు ఎన్నో ధర్మాలు తెలుసు. వాటిని నువ్వు ఆచరిస్తావు కూడా. అయినా పరులభార్యను కోరవచ్చా?" అని అడగగా... అతడు ఆ మాటలు పట్టించుకోకుండా ఏడుస్తూనే వుంటాడు. అప్పుడు రాజు తన మనసులో "దు:ఖములో వున్న బ్రాహ్మణుని ప్రాణాలు ఇచ్చిఐనాసరే.. అతని శాంతింపజేయాలి. ఇతడు నా భార్యను అడుగుతున్నాడు. ఇచ్చి ఇతని దు:ఖమును పోగొట్టాలి" అని నిశ్చయించుకుంటాడు.

అలా రాజు అతనితో "ఓ భూసురా! ఇదిగో.. నువ్వు కోరినట్లే నా భార్యను నీకు దానంగా ఇస్తున్నాను. తీసుకో" అని తన సతీమణిని అతనికి ఇచ్చేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గజ చర్మంతోను, సర్పాభరణాలతోను, చంద్రరేఖతోను, జటాజూటముతో పరమశివుడిగా ప్రత్యక్షమై.. "ఓ రాజా! నీ భూతదయను పరీక్షించడానికి నేనే బ్రాహ్మణుడి రూపంలో వచ్చాను. పులినోట పడిన స్త్రీ పార్వతి. పులి అన్నది నామాయా విలాసము. నీ త్యాగబుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను. కావలసిన వరాలను కోరుకో" అని పలుకగా.. రాజు ఆయనకు సాష్టాంగదండ ప్రణామములు చేసి, భక్తితో స్తుతించి "పరమేశ్వరా! నీ దర్శనం కలగడంతో నేను ధన్యుడిని అయ్యాను. నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను, నన్ను పెంచిన పద్మాకర దంపతులను కూడా నీ గణములలో చేర్చుకుని సర్వదా నీ సాన్నిధ్యభాగాన్ని ప్రసాదించు" అని వేడుకుంటాడు.

మాలిని వచ్చి వారిని నమస్కరించి, "దేవదేవా! నా తల్లిదండ్రులకు కూడా నీ సాన్నిధ్యమును ప్రసాదించు" అని అడుగుతుంది. పరమశివుడు వారికి ఆ వరాలచ్చి అక్కడినుంచి అదృశ్యమవుతాడు.

రుద్రాధ్యాయ (నమక) మహిమ :

శివుని విశ్వరూపాన్ని వర్ణించే మంత్రభాగాన్ని రుద్రాధ్యాయం అంటారు. దీనికి నమకమని, శతరుద్రియమనే పేర్లు కూడా వున్నాయి. సంప్రదాయజ్ఞులు నమకము, చమకము, పురుషసూక్తము వంటి మంత్రాలతో శివునికి ఒకసారిగానీ, మూడుసార్లుగానీ, ఐదుసార్లుగానీ, తొమ్మిదిసార్లగానీ, పదకొండుసార్లుగానీ అభిషేకం చేస్తారు. ఈ నమకమును బ్రహ్మ తన దక్షిణ ముఖంనుండి యజుర్వేదంతో సహా ఉచ్చరిస్తాడు. ఇది సకలోపనిషత్తులను సారభూతమైంది.

శ్లోకము : ఏష ఏవ పరోమంత్ర: ఏష ఏవ పరం తప:
రుద్రాధ్యాయజప: పుంసాం పరం కైవల్యసాధనమ్!!

భావం : ఈ రుద్రాధ్యాయము సర్వత్తమమైన మంత్రం. ఇది ఒక గొప్ప తపము. ఇది ముక్తి సాధనం కోసం జపిస్తారు. కామక్రోధలోభాది షడ్వర్గములను నాశనం చేసి కైవల్యమును ప్రసాదించును. నమక పారాయణమును, రుద్రాభిషేకమును చేయు వారి జోలికి మేము పోలేమని యమభటులు యమునితో విన్నవించుకొంటున్నారు. రుద్రాభిషేకం చేసేవారికి అన్నవస్త్రములకు, ఐశ్వర్యాలకు లోపం ఎప్పుడూ కలగదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది. ఆయువు, ఆరోగ్యం లభిస్తుంది.

శ్లోకము : రుద్రాధ్యాయీ వసే ద్యత్ర గ్రామే వా నగరేపి వా!
న తత్ర క్షుత్పిపాసాద్యా దుర్భిక్ష వ్యాధయో పిచ!!

భావం : ఒక రుద్రపారాయణపరుడు ఏదైనా ఒక గ్రామంలోగానీ, నగరంలోగానీ నివసిస్తాడో.. అక్కడ ఆకలిదప్పులుగానీ, కరువుకాటకాలుగానీ, వ్యాధులుగానీ వుండవు.

వింధ్వపర్వతము - అగస్త్యుడు :

ఒకప్పుడు నారదుడు ఓంకారక్షేత్రమును దర్శించి మార్గవశమున వింధ్వపర్వతం దగ్దరకు చేరుకుంటాడు. నారదుని చూసి వింధ్వము మానవరూపంలో ఎదురువచ్చి, స్వాగతం పలికి, తన నివాసానికి తీసుకొని పోతాడు. దధి, మధు, ఆజ్య, నీర, ఆర్ద్రాక్షత, దూర్వ, కుశ, ప్రసూనములతో అష్టార్ఘ్యములొసంగి పూజించెనను. విశ్రాంతి కోసమని నారదుని పాదాలను తొక్కుతూ... "మీరు రావడం వల్ల నా ఇల్లు పవిత్రమైంది. కులపర్వతాలతో మాన్యడయ్యాను. మీరు ఏమి భావించకపోతే.. ఒక మాట అడగాలనుకుంటున్నాను. మేరుప్రముఖ పర్వతాలకు భూమిని ధరించే సామర్థ్యం వున్నదని పెద్దలంటుంటారు. నేను భూమిని భరిస్తున్నాను. పార్వతీ జననం చేత, శివునికి మాయమవుట వల్ల హితవంతుడు పర్వతాలకు రాజయ్యాడు.

సరే.. మరి బంగారంతో, రత్నాలతో నిండి వున్నంతమాత్రాన మేరుపర్వతం గొప్పదవుతుందా? ఉదాహరణకు ఉదయపర్వతమును చూద్దామా..! అది మందేహ రాక్షసులతో నిండిపోయింది. అస్తపర్వతం కాంతిహీనమైంది. మందరము సముద్రంలో తిరిగితిరిగి గుడ్డిదైంది. మలయము సర్పాలతో నిండివుంది. రైవతకము నేతిబీరకాయ వల్ల ధనము ఇవ్వగలుగుతుంది. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్థ్యం లేదు. మరి నాకేమీ తక్కువ?" అని పలుకుతాడు. అప్పుడు వింధ్యుని గర్వమును గ్రహించిన నారదుడు "ఇతడు శ్రీశైలాదులను గమనించినట్లు లేదు" అనుకొని.. అప్పటికి తగిన మాటలను అని వెళ్లిపోతాడు.

వింధ్యునికి తాను తక్కువ వాడని భావం కలిగి.. తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని తపన కలిగుతుంది. సూర్యచంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేస్తారు. వారు నా చుట్టు దిరిగునట్లు చేసెదనని మహోన్నతంగా పెరిగిపోతాడు. సూర్యుడు ఉదయించెను. కానీ రథము ముందుగు సాగలేదు. అక్కడ వింధ్యుడు అడ్డగా నిలుస్తాడు. నక్షత్ర గ్రహసంచారం కూడా ఆగిపోయాయి. అహోరాత్రులకు భేదాలు తెలియడంలేదు. మునుల స్నానసంధ్యాదికృత్యాలు స్తంభించిపోయాయి. బ్రహ్మాది దేవతల దగ్గరకు వెళ్లి మునులు మొరపెట్టుకుంటారు.

వారందరూ ఆలోచించి మహాతపశ్శాలి అయిన అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారం చెప్పలేరని నిర్ణయించి.. అందరూ కలిసి కాశీపురంలో లోపాముద్రంతో నివసిస్తున్న అగస్త్యుని దగ్గరకు వెళ్తారు. ఆయన బ్రహ్మాది దేవతలను చూసి, పరమాశ్యర్యం చెందుతాడు. వారికి తగిన మర్యాదలు చేసి, "మీరందరు నన్ను ధన్యుని చేయడానికి వచ్చారని భావిస్తున్నాను" అని అంటాడు. బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి "ఓ మునీంద్రా! ఒక లోకోపకారం నీవల్ల కావలసి వుంది. నువ్వు సామాన్యుడివి కావు. గర్వాంధుడైన నహుషుని శపించి దేవలోకాన్నే కాపాడావు. సముద్రాల నీటిని తాగి కాలకేయాది రాక్షసులను చంపడానికి తోడ్పడినావు. ఈ లోపాముద్ర రాజకుమార్తె అయిన గణనకెక్కిన మహాపతివ్రత" అని పొగుడుతుండగా... "విషయమేంటో చెప్పండి" అని అగస్త్యుడు అంటాడు.

అంతట బ్రహ్మ "చూశావు కదా! లోకానికి కలిగిన ప్రళయము? సూర్యోదయం కాలేదు. సర్వలోకాలు చీకాకు పడుతున్నాయి. సూర్యచంద్రాదుల గమణానికి వింధ్వము అడ్డుగా వచ్చివుంది. నువ్వే అతని గర్వాన్ని అణచగల సమర్థుడివి. ఇది లోకానికి క్షేమంకరమైన కార్యం" అని పలుకగా.. అగస్త్యుడు సరే అని అంగీకరిస్తాడు.

కానీ కాశిని విడిచి వెళ్లవలసి వస్తుంది కదా అని విచారణలో వుంటాడు అగస్త్యుడు. గంగలో స్నానమాడి, గంగను, విశ్వేశ్వరునిని సేవించి, అతనికి, విశాలాక్షిని, కాలభైరవునకు, డుంఢి విఘ్నేశ్వరుడికి, బిందుమాధవునకు, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి విచారంగా అగస్త్యుడు కాశీని విడిచి వెళతాడు. వింధ్వపర్వత సమీపానికి వెళ్లగానే అతడు మనిషిరూపంలో ఆయనకు స్వాగతం పలుకుతాడు. "మీరు ఇటువైపుకు రావడానికి కారణమేంటి?" అడి అడుగుతాడు.

మునీంద్రుడు "నేను దక్షిణ దేశయాత్ర చేయడానికి బయలుదేరాను. నీ మర్యాదలకు చాలా సంతోషం. కాని ఈమె రాజకుమార్తె అని నీకు తెలుసుకదా! ఇప్పటికే ప్రయాణం చేసి అలసిపోయింది. నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు ఆనందమేకానీ, మాకు ముందుకు వెళ్లడానికి దారేది? నువ్వు కొంచెం తగ్గి, ఆయనకు నమస్కరించి, ఇంతకుముందు లాగా తగ్గి దారియిచ్చెను.

ఆయన వెళుతూ.. "మేము మరలా ఈ మార్గం నుండే వచ్చెదము. అప్పుడు మళ్లీ నేను నిన్ను ప్రార్థించలేను. మేము వచ్చేంతవరకు ఇలాగే వుండు" అని కేరి దక్షిణదిశకు వెళ్తాడు. ఆయన కొల్లాపురం దగ్గర శ్రీమహాలక్ష్మిని సేవించి, అక్కడినుండి దక్షారామంనందు వున్న భీమేశ్వరునిని చూసి, అక్కడినుండి శ్రీశైలానికి వెళ్లి భ్రమరాంభమల్లికార్జునులను సేవించి, కాశిని విడిచి వచ్చిన దు:ఖాన్ని విస్మరిస్తాడు. స్కందవనమును చేరి, స్కందుని వల్ల వారణాసీ విశేషాలను తెలుసుకుంటాడు.

జ్ఞానవాపి : 

స్కందుడు అగస్త్వమునితో ఈ విధంగా అంటాడు..."జ్ఞానవాపీ వృత్తాంతము చెబుతాను విను. ఒకప్పుడు భూలోకంలో అనావృష్టి కలిగి ప్రాణులకు గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు దొరకక అల్లాడిపోతారు. చెరువులు ఎండిపోతాయి. నదులలో నీళ్లు నామమాత్రం అవుతాయి. అటువంటి సమయంలో ఈశానుడు అనేవాడు (ఇతడు ఈశాన్యదిక్పాలుడో లేక ఒక మునియో కావచ్చు) జటాధారి ఆనందకాననమని చెప్పబడే కాశీక్షేత్రమునకు వచ్చాడు.

అక్కడ ఆయన విశ్వేశ్వరలింగాన్ని చూసి అభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఎక్కడ నీరు దొరకలేదు. అప్పడు ఈశానుడు తన చేతిలోని త్రిశూలంతో ఆలయానికి దక్షిణంవైపు తవ్వుతాడు. ఆ కుండంనుండి ప్రచండవేగంతో నీళ్లు పైకి వస్తాయి. దాంతో కాశీనగరమంతా జలసంపూర్ణమయ్యింది. ఆ నీటితో ఈశానుడు విశ్వేశ్వరునికి తనివితీర అభిషేకం చేస్తాడు.

దీంతో విశ్వేశ్వరుడు సంతుష్టుడై ఈశానునితో ఇలా అంటాడు.."నువ్వు చేసిన ఈ అభిషేకానికి చాలా సంతోశిస్తున్నాను. నువ్వు ఏదైనా వరాన్ని కోరుకో"అని. ఈశానుడు "స్వామీ! నువ్వు నాకు వరమిచ్చినట్లయితే.. ఈ తీర్థం నీ పేరుమీద ప్రసిద్ధికెక్కినట్లు వరమివ్వు" అని ప్రార్థిస్తాడు.

విశ్వనాథుడు "త్రిలోకంలో వున్న తీర్థములకంటే ఈ తీర్థం శ్రేష్టమై వుంటుంది. ఇది శివతీర్థమని ప్రసిద్ధి పొందును. శబ్దార్థవేత్తలు 'శివ' మనగాజ్ఞానమని చెబుతారు. అది ఇక్కడ ద్రవరూపంలో వెలసింది కావున "జ్ఞానతీర్థం" అని చెప్పబడును. అది కలిగి వున్న వాపి (నూయి) జ్ఞనవాపి. ఈ తీర్థాన్ని సృశించినా, ఆచమనం చేసినా అశ్వమేధఫలం లభించును. ఏకాదశినాడు ఉపవాసం చేసి ఈ తీర్థాన్ని మూడుసార్లు పుచ్చుకొని ఆచమించినచో అతని హృదయంలో శివుడు జ్ఞానదీపమై ప్రకాశించును. ఇది సర్వరోగాలను హరిస్తుంది. ఇక్కడ పిండప్రదానం చేసినవారు పితృదేవతలు తరిస్తారు. ఈ తీర్థంతో విశ్వేశ్వరుడైన నన్ను అభిషేకించినవారికి, సర్వతీర్థాలతో అభిషేకించిన ఫలాన్ని కలుగుతారు. ఈ తీర్థాన్ని భక్తితో సేవించినవారికి జ్ఞానోపదేశం కలుగుతుంది" అని చెప్పగా.. ఈశానుడు చాలా సంతోషిస్తాడు.

అష్టవిధి విధానాలు :

మానవుని లోకంలో వివాహం ఎనిమిది విధాలుగా వుంటుంది. అవి, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము.

1. బ్రాహ్మము : యోగ్యుడైన వరుడిని పిలిచి, అలంకరించిన కన్యను ఇచ్చి చేయు వివాహాన్ని బ్రాహ్మము అంటారు. ఈ దంపతులకు పుట్టిన కొడుకు ఇరవైతరాలవరకు వారిని తరింపజేస్తాడు. ఇది సాధారణంగా ఇళ్లలో జరుగుతున్నదే.

2. దైవము : యజ్ఞంనందు ఋత్విజుడుగా వచ్చిన బ్రహ్మచారికి కన్యనిచ్చి చేసే వివాహం దైవము. వీరికి పుట్టిన కుమారుడు పద్నాలుగు తరాలవారిని పవిత్రులుగా జేస్తారు.

3. ఆర్షము : వరుని వద్దనుండి రెండు గోవులను కన్యాశుల్కంగా గ్రహించి,కుమార్తెనిచ్చి చేసే వివాహము ఆర్షము. వీరి కుమారుడు ఆరు తరాలవారిని పవిత్రులుగా చేస్తాడు.

4. ప్రాజాపత్యము : మీరిద్దరు దంపతులై గృహస్థధర్మాన్ని నిర్వర్తించండి అని వధూవరులను దీవించి చేసిన వివాహమే ప్రాజాపత్యము. వీరి కుమారుడు ఆరుతరాలవారిని ఉద్ధరిస్తాడు.

5. ఆసురము : వధువు ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా, వరునినుండి ధనం తీసుకొని కన్యను విక్రయించి చేసే వివాహమే ఆసురము.

6. గాంధర్వము : వధూవరులు యుక్తవయస్కులై ఒకరిని చూసి ఇంకొకరు ఇష్టపడి, పెద్దల అనుమతి లేకుండా పంచభూతాల సాక్షిగా చేసుకునే వివాహమే గాంధర్వము. కలియుగంతో సత్యం క్షీణించింది కాబట్టి ఈ వివాహం నిషేధించబడింది. పూర్వం శకుంతలా దుష్యంతులు ఈ విధంగానే దంపతులయ్యారు.

7. రాక్షసము : వధూవరులకు పరస్పరం ఇష్టముంటుంది. పెద్దలు అనుమతించరు. అప్పుడు వరుడు తన భుజబలంతో వారితో పోరాడి గెలిచి, కన్యను తెచ్చుకొని వివాహమాడడం రాక్షసము. పెద్దలు ఈ విధమైన వివాహాన్ని తరుచుగా సమ్మతించరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగానే చేపట్టాడు.

8. పైశాచము : కన్యకు గానీ, ఆమె కుటుంబంవైపు వారికి గాని ఇష్టముండదు. అయినా వరుడు బలాత్కారంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునే వివాహమే పైశాచము.

ఈ పై ఎనిమిది వివాహాలలో మొదటి నాలుగు బ్రాహ్మణులకు యోగ్యమైనవి. గాంధర్వ, రాక్షసములు రాజులకు, వైశ్యులకు తగినవి. తన ధర్మపత్నియందు బూతుకాలాన్ని సంగమం చేసేవాడు సదా బ్రహ్మచారిగా పరిగణించబడతాడు. పగటి కాలంలో, తల్లిదండ్రుల శ్రాద్ధదినములలో, సర్వపర్వములందు స్త్రీసంగమం చేయరాదు. చేసినచో ధర్మం నుండి పతితుడవుతారు. దానివల్ల అథోగతులు కలుగుతాయి. కన్యలను నమ్ముకొని ఆ ధనంతో జీవించేవాడు ఒక కల్ప పర్వంతం నరకంలో నుండి పురుగులను ఆహారంగా తింటాడు. వాడేకాక వాని పూర్వులను కూడా నరకంలో తీసుకెళ్తాడు.

తన భర్తతో సంతుష్టి పొందిన పతివ్రతను, తన ధర్మపత్నితో సంతోషం పొందిన భర్త, ఏ గృహంలో అయితే వుంటారో, అక్కడ శ్రీమహాలక్ష్మి, నారాయణునితో సహా నివసించి శుభాలు కలుగుతాయి. గృహస్తులకు నిత్యం పంచసూచనాలతో (ఐదు విధాలైన జీవుల వధ్యస్థానములు) పని వుంటుంది. అవి కండన్సిరోలు, పేషణ్సితిరుగలి, లేదా సన్నికల్లు, చుల్ల్సీపొయ్యి, ఉదకుంభ: నీడి కడవ, మార్జన్సీచీపురుకట్ట. ఈ ఐదింటిని గృహస్తులు వాడక తప్పదు. వాడినప్పుడు వారికి తెలియకుండా కొంత జీవహింస జరగవచ్చు. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి వెనుక చెప్పిన పంచమహాయజ్ఞములను గృహస్థులు చేయాలి. వాటితో పరిహారమగును.

కొన్ని సాధారణ ధర్మాలు : 

అశ్వద్ధ వృక్షముగాని, రచ్చబండమీద చెట్టుగాని, గురువుగాని, నీటి కడవగాని, అన్నరాశిగాని, పెరుగు - పాల కడవలు గాని కనబడినప్పుడు వాటికి ప్రదక్షిణములు చేయాలి. భార్యతో సహా పంక్తిని భుజింపరాదు. భోజనం చేస్తున్న స్త్రీని చూడరాదు. ఒక్క వస్త్రాన్ని ధరించి భుజింపరాదు. అగ్నిని నోటితో ఊదకూడదు. నిద్రపోతున్న వారిని లేపకూడదు. సాయంత్రంవేళ ఎటువంటి పదార్థాలను తినకూడదు, నిద్రపోకూడదు. నిలబడివుండి మూత్రాన్ని విసర్జించరాదు.

నీటిలో మలమూత్రాలను విడవకూడదు. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఇతరుల బట్టలను ధరించరాదు. చెప్పులు కూడా ఇంకొకరివి వేసుకోకూడదు. రాత్రిపూట పెరుగుతో అన్నం తినకూడదు. చిరకాలం జీవించాలనుకునేవాడు, గోవుమీద స్వారి చేయకూడదు. ప్రేతధూమం (వల్లకాటి పొగ) నాఘ్రాణించరాదు. ఉదయం సూర్యుని ఎండలో కూర్చోకూడదు. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. అదికూడా ప్రేమగా చెప్పాలి. ప్రేమగా వున్నారుకదా అని చనువుగా తీసుకుని అసత్యం చెప్పకూడదు. ఓ అగస్త్యమునీ! ఇది సనాతనమైన ధర్మం.

శ్లోకం : సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయా
న్న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయా
దేష ధర్మో ఘటో ధ్భవ! (స్కంద:)

భావం : పెద్దవారు వచ్చినప్పుడు, తన పీఠమునుండి లేచి వారికి ఇవ్వాలి. పెద్దలు వున్నచోట కాలుచాపి కూర్చోవడం, పడుకోవడం పనికిరాదు. పెద్దలను పరోక్షంగాకానీ, ప్రత్యక్షంగాగానీ నిందించకూడదు. ఎదుటివారిని స్తుతించుట, ఆత్మనింద పనికిరావు.

శ్లోకం : శ్రద్దయా ప్రతిగృహ్ణాతి శ్రద్ధయా య: ప్రయచ్ఛతి
స్వర్గిణౌ తావుభౌ స్యాతతాం పతతో శ్రద్ధయా త్వద: !!

భావం : దానం ఇచ్చేవాడుగాని, తీసుకునేవాడుగాని శ్రద్ధగలవారైనప్పుడే ఇద్దరికి స్వర్గసుఖం కలుగుతుంది. శ్రద్ధ లేనిచో పతనం చెందుతారు. వేదవిద్యను శిష్యులకు దానం చేయడంవల్ల బ్రాహ్మణుడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అసత్యం పలికితే చేసిన పూజలు ఫలించవు. గర్వం వల్ల తపము నాశనమవుతుంది. పదిసార్లు పొగడటంవల్ల తానిచ్చిన దానంవల్ల ఫలం నశిస్తుంది. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయము నశించును.

వ్యాసుడు కాశిని శపించబోయి భంగపడుట : 

ఒకప్పుడు వ్యాసుడు శౌనకాది మునులుండే నైమిశారణ్యానికి వెళ్తడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రచించినవాడని వ్యాసునికున్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య "ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా? లేక విష్ణుమూర్తియా?" అని చర్చ జరుగుతుంటుంది. చివరికి ఆ మునులందరూ "విశ్వేశ్వరుడొక్కడే ముక్తిదాత. మరొకడు ఎవ్వరులేరు" అని అంటారు.

అప్పుడు వ్యాసుడులేచి, చెయ్యి పైకెత్తి "ఇదిగో.. నేను చెబుతున్నాను వినండి. వేదాలలో, పురాణాలలో, మహాభారతంలో వర్ణింపబడినవాడొక్కడు విష్ణుమూర్తియే. అతడే సృష్టి స్థితిలయములకు కారణభూతుడైన యాదిపురుషుడు. కాబట్టి అతడే మోక్షదాత శివుడు కాడు" అని చెబుతాడు. అది విన్న మునులందరూ ఆశ్చర్యపోయి, "మహానుభావా! నువ్వు సర్వజ్ఞుడవు. నీకంటే బాగా తెలిసిన వారెవ్వరున్నారు? అయితే, నువ్వు ఇప్పుడన్న మాటలు కాశిలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే, మాకు ఆనందం కలుగుతుంది" అని అంటారు.

వ్యాసుడు అంగీకరించి తన పదివేలమంది శిష్యులతో, మునులతో కాశికి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి, బింధుమాధవునిని భక్తితో సేవించి...

శ్లోకము : సహస్రశీర్ష పురుష పురుహూత సుఖప్రద!
యధ్భూతం యచ్చ భావ్యం వై తత్రైక: పురుషో భవాన్ !!

అనే స్త్రాత్రాన్ని చేస్తాడు. తరువాత నృత్యగీతవాద్యాలతో మాధవునిని సేవిస్తాడు. ఆ పిమ్మట మాధవుడొక్కటే మోక్షదాత అని చేతిని పైకి ఎత్తుతాడు. అప్పుడు అతని చేయి ఎత్తినట్లే స్తంభించిపోతుంది. మాటలు కూడా స్తంభించిపోతాయి. అప్పుడు మాధవుడు వచ్చి... "ఓయి వ్యాపా! ఎంత తప్పు చేసినావు?

ఏక ఏవ హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన,
తత్ప్రసాదా దహం చక్రీ లక్ష్మీ శస్తత్ప్రభావత: !!
తైలోక్యరక్షా సామర్థ్యం దత్తం తే నైవ శంభువా !

భావం : ఈ విశ్వంలో ఈశ్వరుడు అతడొక్కడే. వేరొకరు లేరు. ఆయన దయవల్లే నేను చక్రినయ్యాను. లక్ష్మీశుడనయ్యాను. త్రైలోక్యాన్ని రక్షించే సామర్థ్యం అతని వల్లే నాకు కలిగింది. నువ్వు శుభాన్ని గోరాలంటే శంకరుని స్తుతించు" అని అంటాడు.

అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకుమని సన్న చేస్తాడు. విష్ణువు అలా చేయగా.. నందివల్ల స్తంభించిన వాక్కును, అంగములు తిరిగి స్వాధీనంలోకి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీమహాదేవునిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. తరువాత వ్యాసుడు "లింగేష్వేకో హి విశ్వేశ, స్తిర్థేషు మణికర్ణికా" అని చాటుతూ, నిత్యం స్నానంచేసి ముక్తిమండపంలో కూర్చొని శిష్యులకు విశ్వేశుని దివ్యమహిమలను, వేద పాఠాల గురించి చెబుతూ గడుపుతుండేవాడు.

ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో "వ్యాసుడికి భిక్ష దొరకకుండా చేయు" అని చెబుతాడు. ఆమె కాశియందలి సర్వగృహిణుల హృదయంలో ఆవేశించి, వ్యాసుడిని, శిష్యులను భిక్షకు వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండ చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేస్తాడు. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరుతారు. వ్యాసునికిగాని, శిష్యులకుగాని యే ఇంటిదగ్గర భిక్ష దొరకలేదు.

వ్యాసుడు శిష్యులతో "మనకు నిన్న, ఈనాడు భిక్ష దొరకకపోవడానికి హేతువు ఏమై వుంటుంది? మిగిలినవారికి లభిస్తోంది కదా! మనకు మాత్రమే ఎందుకు లభించుట లేదు? ఎవరైనా అడ్డు పడ్డారా? విచారించి రండి" అని పంపగా... వారు వెళ్లి వచ్చి "గురుదేవా! అందరూ క్షేమంగానే వున్నారు. ఎవరికీ దారిద్ర్యం లేదు. ఎవరూ అడ్డుపడలేదు. అందరూ శ్రీ విశ్వేశ్వరారాధకులే. మనకు భిక్ష లభించకపోవడానికి కారణమేంటో తెలియడం లేదు?" అని విన్నవిస్తారు.

వ్యాసుడు "కాశి సర్వవిద్యలకు నిలయమం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ వుండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కారు" అని క్రోధంతో

"మా భూ త్రైపూరుషీ విద్యా మా భూ త్రైపూరుషం ధనం,
మా భూ త్రైపూరుషీ ముక్తి: కాశ్యాం నివసతాం నృణామ్"

(కాశిలో నివసించేవారికి మూడుతరాల వరకు విద్య, సంపద, ముక్తి లేకుండుగాక) అని శపిస్తాడు. శాపమిచ్చిన తరువాత కూడా మళ్లీ భిక్షకై వీధివీధి తిరుగుతారు. కాని భిక్ష లభించదు. కోపంతో చేతిలో భిక్షపాత్రను నేలమీద పగులగొట్టి ఆశ్రమానికి పోతుండగా.. ఒక ఇల్లాలు వ్యాసునిని పిలిచి "మునీంద్రా! నా భర్త వృద్ధుడు. ప్రతిదినం అతిథులకు పెట్టకుండా ఏమీ తినడు. ఈరోజు అతిథులు ఎవరు రాలేదు. ఆయన భుజించకుండా కూర్చున్నాడు. మీరు అతిథులుగా దయచేయండి" అని పిలుస్తుంది.

వ్యాసుడు ఆమెను చూసి, ఆశ్చర్యపడి... "అమ్మా! నిన్న, ఈరోజు కాశిలో మా మొహం చూసినవారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు. సంతోషము. నేను ఒక్కడినే కాదు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేక వున్నారు" అని అంటాడు. ఆ ముత్తైదువు "అలా అయితే మీరందరూ భోజనానికి రండి. ఆలస్యం చేయకూడదు" అనగా.. వారందరూ సంతోషడి వస్తారు. పాదప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చుంటారు. వడ్డించిన పధార్థాలను చూడగానే వ్యాసుడు, శిష్యులు భుజిస్తారు. కాళ్ళు, చేతులు కడుక్కొని యాచమించి, ఆ ఇల్లాలిని దీవించి బయలుదేరడానికి సిద్ధపడతారు.

అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో... "తీర్థవాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతున్నాడు" అని ప్రశ్నిస్తుంది. వ్యాసుడు, "తల్లీ! అల్పజ్ఞుడిని, నేనేమి చెప్పగలను. అన్నీ నీకు తెలుసు. అడుగుతున్నావు గనుక చెబుతున్నాను. ఆకలిగా వున్నవారికి అన్నం పెట్టటం, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించడం కన్నా ఉత్తమ ధర్మం లేదు" అని అంటాడు. ఆమె "అదే ధర్మమైతే యథాశక్తిగా చేస్తున్నాను. నీవు సామాన్యధర్మాలను చెప్పు" అని అడుగుతుంది.

అప్పుడు వ్యాసుడు.. "ఎవరినీ నొప్పించకుండా మాటలాడటం, తానున్న స్థానం వృద్ధినొంద గోరుట నేవి ప్రతి మానవునికి సామాన్య ధర్మాలు" అని చెబుతాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు.. "మునీంద్రా! ఈ ధర్మాలలో నీ దగ్గరున్న వెన్ని?" అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చష్టుడై చూస్తాడు.

మళ్లీ ఆయన ఇలా అంటాడు.. "ఈ ధర్మాల గురించి చెప్పడానికి నీవే అర్హుడివి. నీకన్న మృదువైన మాటతీరు, ఆలోచించి పనిచేయగల స్వభావం, వున్నఇంటికి మేలుగోరుతత్త్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంతస్వభావములు మరెవ్వరికి వుండవు? మహానుభావుడివి గనుక నువ్వు చెప్పగలవు. చెప్పినవి ఆచరించగలవు కూడా" అని వ్యంగ్యంగా మాట్లాడుతాడు.

అంతటితో ఆగకా.. "నీకు నీ అభాగ్యం వల్ల భిక్ష దొరకలేదు. దానికి పురవాసుల దోషం ఏమున్నది? ఎందుకు వారిని అనవసరంగా శపించావు? ఇది నా రాజధాని. దీనిపై నీవంటివారి శాపాలు పనిచేయవు. నీవంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశిలో నివసించడానికి అర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశిని వదిలి వెళ్లు. ఈ కాశిపై ఎవ్వరైనా దుర్మార్గాన్ని చూపించినచో వాడు రుద్రపిశాచమవుతాడు" అని కఠినంగా మాట్లాడుతాడు.

అది విన్న వ్యాసుడు గడగడ వణుకుతూ, వారి పాదాలపై పడి జగన్మాతతో... "తల్లీ! నేను అనాథుడిని. అవివేకుడ్ని, నిన్నే శరణు పొందాను. రక్షించు. నీ కుమారుని వంటివాడిని. విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడు. కాశిని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమినాడు, ప్రతి మాసశివరాత్రినాడు నాకు కాశీప్రవేశానికి అనుమతి ఇవ్వు" అని దీనంగా ప్రార్థిస్తాడు.

ఆ జగన్మాత కరుణామూర్తియై, తన భర్తవైపు చూస్తుంది. తరువాత వ్యాసునితో "నీ కోరిక తీరుతుంది" అని పలుకుతుంది. ఆ దంపతలంతర్ధాన మొందిరి. వ్యాసుడు వెంటనే కాశిని విడిచి, గంగకు తీర్పుతీరంలో నివసిస్తూ, నిత్యం కాశినగరంవైపు చూస్తూ, నిట్టూర్చుతూ, తన దురదృష్టాన్ని నిందించుకొంటుంటాడు. అప్పుడు అతను నివసించిన ప్రాంతమే "వ్యాసకాశి". యాత్రలకు వెళ్లినవారు, వ్యాసేశ్వరునిని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాసకాశిలో నివసించరు. అగస్త్యునకు స్కందుడి కథ చెప్పి, "మునీశ్వరా! కాశికి శుభం కోరేవారికి ఎల్లప్పుడూ శుభమే కలగాలి" అని చెబుతాడు.

ఇంద్రద్యుమ్ముడు :

పూర్వం ఇంద్రద్యుమ్ముడనే ఒక మహారాజు అనేక యజ్ఞాలు చేశారు. ఆయన చేసిన యజ్ఞముల దర్భలతో భూమి రెండంగుళాల ఎత్తు పెరిగింది. యజ్ఞాగ్నిహోత్రముల వేడికి భూమి ఉడికిపోయి, లోపలినుండి జలం ఆధారంగా పైకి పొంగివచ్చింది. అదే మహీనది అని పేరు పొందింది.

ఇంద్రద్యుమ్నుడు దేహము చాలించి, స్వర్గానికి పోయి భోగాలను అనుభవిస్తుంటాడు. కొన్ని కల్పములు గడుస్తాయి. ఒకనాడు బ్రహ్మ ఇంద్రద్యుమ్నుడ్ని పిలిచి, "నువ్వు స్వర్గ సుఖాన్ని అనుభవించినందుకు పుణ్యం చెల్లిపోయింది. పుణ్యహీనులు స్వర్గాన్ని అనుభవించే వీలులేదు. నీ పుణ్యాలను సంపాదించుకొని రా" అని చెప్పాడు.

అతడు "నేను పుణ్యం ఎలా సంపాదించాలి?" అని అడగగా.. "భూలోకంలో నీ గురించి ప్రశంసించేవారు వుంటే... ఆ కీర్తి వల్ల నువ్వు పుణ్యాలను పొందినట్లే. వెళ్లి విచారించి రా" అని పంపిస్తాడు.

పూర్వము తాను పరిపాలించిన కాంపిల్య నగరానికి వస్తాడు. అంత అతనికి కొత్తగా అనిపిస్తుంటుంది. "ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పూర్వం ఈ నగరాన్ని పాలించాడు. అతని గురించి మీకు తెలుసా?" అని అందరిని అడిగాడు. వారు "తెలియదు.. కానీ సప్తకల్పముల ఆయుర్దాయముగల మార్కండేయుడిని అడుగు" అని చెప్పారు.

రాజు ఆ మార్కెండేయున్ని వెతుక్కుంటూ వెళ్లి, అతనికి నమస్కరించి.. "ఇంద్రద్రుమ్యుని గురించి మీరైమైనా చెప్పగలరా?" అని అడుగుతాడు. ఆయన "నాకు తెలియదు కానీ, నాకు మిత్రమైన ఒక బకం గలదు. అది నాకంటే చాలా పెద్దది. అది చెప్పగలదు రా" అని తీసుకొని వెళ్తాడు.

నాడీజంఘుడను ఆ బకము వారికి మర్యాదలు చేసి "నాకు పద్నాలుగు కల్పములు గుర్తున్నాయి. కానీ ఇంద్రద్యుమ్నుని గురించి వినలేదు" అనగా.. రాజు, మార్కెండేయుడు నిరుత్సాహపడతారు. రాజు.. "నేను పుణ్యహీనుడై బ్రహ్మ దగ్గరికి వెళ్లి మళ్లీ అతనిచే పొమ్మనిపించుకోలేను. అగ్నిప్రవేశం చేసెద"ననగా బకము.. "రాజా నాకంటే వృద్ధమైన ప్రాకారకర్ణుడనే గుడ్లగూబ కలదు. దానిని అడుగుదాం" అని ముగ్గురు వెళ్లి అతడిని చూసి ఇంద్రద్యుమ్నుని గురించి అడిగారు.

ఆ గూడ "మిత్రులారా! నేను పుట్టి ఇరవైఎనిమిది కల్పముల అయింది. ఆ రాజు గురించి వినలేదు. కాని నాకన్నా వృద్ధమైన గ్రద్ధ ఒకటి గంధమాదనపర్వం మీద వుంది. దానిని అడుగుదాం" అని వారితోకూడా బయలుదేరి గ్రద్దవద్దకు వచ్చి ఆ రాజు గురించి అడిగారు.

అప్పుడా గ్రద్ద "నేను ఆ రాజు గురించి వినలేదు. కానీ, నాకన్నా పెద్దదైన మంథరకుడనే తాబేలుంది. దానిని అడుగుదాం" అని చెబుతూ తాను కూడా వారితో మంథరకుని వద్దకు వెళ్లెను.

మంథరకుడు వీరిలో వున్న రాజును చూసి నీటిలోనికి పారిపోగా.. వారు అతనిని పిలిచి, "మిత్రులకు మర్యాద చేయకుండా పోతున్నావేమీ?" అని అడగగా.. అతడు "నేను ఈ రాజును చూసి భయపడి పారిపోతున్నాను. విశాలమైన బొరుసు కలిగివున్నందున నన్ను ఇతడు అనేక యజ్ఞాలలో వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇప్పటికీ ఆ కాలిన పుండు మానలేదు. మళ్లీ నన్ను యజ్ఞవేదికగా వాడుకోవడానికి వచ్చాడేమోనన్న భయంతో వెళ్లడానికి ప్రయత్నించాను. అంతేకాని అతిథి మర్యాద తెలియక కాదు" అనగానే.. ఇంద్రద్యుమ్నును కోసం దేవలోకం నుండి విమానం వస్తుంది.

దేవదూతలు ఆ రాజును ఆహ్వానించారు. రాజు "నా మిత్రులైన వీరందరినీ కూడా రానిస్తే.. స్వర్గానికి వస్తాను" అని అంటాడు. వారు "రాజా! వీరందరూ శివారాధనం చేసి ప్రమథగణములో చేరిపోయారు. కర్మవశమున శాపగ్రస్తులై ఇలా వున్నారు. శాపములు తీరగానే వీరు శివసన్నిధికి చేరుకుంటారు. నువ్వు రా.. వెళదాం" అని అంటారు.

రాజు ఆ మాటలు విని.. "అవునా! వీరు శివారాధనం చేసి శాశ్వత స్థానాన్ని పొందారా? నేను అటువంటి శాశ్వత స్థానాన్ని ఎందుకు సంపాదించకూడదు? స్వర్గానికి పోయిన కొంతకాలానికే నీ పుణ్యం క్షీణించింది. అందుకే పొమ్మంటారు. అలా అనిపించుకోవడం ఎందుకు? మిత్రులారా! నాకు కూడా శివారాధనం చేసి మోక్షం పొందే మార్గాన్ని ఉపదేశించండి" అని పలికి.. వచ్చిన దేవ విమానాన్ని వెనక్కి పంపివేస్తాడు.

తరువాత మంథరకుని మాటపై వారందరూ కలిసి మాళవదేశంలో వున్న సంవర్తుడనే మహాముని దగ్గరకు వెళ్లారు. శ్రమపడి ఆయన దయ సంపాదిస్తారు. ఆయన "ఈ ఇంద్రద్యుమ్నుని యాగాల వల్ల ఉడికిన భూమినుండి పొంగిన మహానది ఇదే. ఇది తీర్థములకెల్లా ఎంతో మహిమ కలది. నేను ఏబదియారు కల్పములనుండి ఈ నదీతీరంలో తపము చేసుకుంటున్నాను. మీరు ఈ నదిలో స్నానమాడి శివునిని సేవించండి. మీకు ఉత్తమగతులు కలుగుతాయి" అని బోధిస్తాడు.

అప్పుడు వారు అతనిని గురువుగా భావించి, శివునిని ఆ నదీ జలంతో అభిషేకించి, శివుని అనుగ్రహం సంపాదిస్తారు. ఇంద్రద్యుమ్నుడక్కడ మహాకాళేశ్వరుడు అనే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తాడు. ఈ రీతిగా వారు చేసిన శివార్చనం వల్ల శాశ్వతంగా శివలోకాన్ని పొందారు. నాడీ సంఘాదులకు శాపములు తొలగిపోతాయి. వారు కూడా ప్రమథగణములో వారివారి స్థానాలను పొందుతారు. శివార్చనం సకల శ్నేయోదాయకం.
అందేకాదు.. స్వర్గాది భోగాలు తాత్కాలికం. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" (పుణ్యం తరిగిపోగానే స్వర్గంనుండి జారి భూమిలో పుడతారు) అని గీతావచనం అట్టి స్వర్గసుఖాలకంటే శాశ్వతమైన మోక్షాన్ని బుద్ధిమంతుడు కోరుకోవాలి.

Source: teluguwishesh

3 comments:

  1. Swamy do you have complete skaanda puranam

    ReplyDelete
  2. Swamy do you have complete skaanda puranam

    ReplyDelete
  3. You can find sanskrit script of gitapress 3.2 GB VOLUME Free download in internet archive
    Search the site for skandapuranam
    You can find hindi book also.
    The book I found was in devanagaralipi.

    ReplyDelete