బ్రహ్మ పురాణం
సూర్యుని వృత్తాంతం :
శౌనకాది మహామునులు నైమిశారణ్యమున పన్నెండు సంవత్సరముల దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి సూతుని తండ్రి అయిన రోమహర్షణుడు వచ్చాడు. మునులందరు అతనికి మర్యాదలు చేసి... ‘‘నువ్వు పురాణాలను చక్కగా తెలుసుకున్నవాడివి. నీకంటే బాగా తెలిసినవారు ఎవరున్నారు? కాబట్టి నువ్వు సృష్టరహస్యం మొదలు దేవరాక్షస మానవచరిత్రలు, భగవద్విషయాల గురించి తెలియజెప్పు’’ అని అడిగారు. అప్పుడు సూతుడు (ఇతడు కూడు సూతుడుగా పిలవబడతాడు) బ్రహ్మాండపురాణాన్ని ప్రారంభించాడు.
బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప్రజాపతికి, దక్షుని కూతురైన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోతుంది. ఆమె ఒకరోజు సూర్యునితో... ‘‘స్వామీ! నీ తేజం భరించరానిదిగా వుంది. గర్భపిండం కూడా మృతిచెందినట్లు కలుగుతుంది’’ అని అంటుంది. ఆమె భావాన్ని గమనించలేని సూర్యుడు ‘‘అవునా? అలా అయితే, మృతినొందినట్లు చేసే అండాలు గలవాడ్ని కనుక నా పేరు ఇంకా మార్తండుడు అవుతుంది’’ అని నవ్వుతూఅంటాడు. ఈ మాటకు ఆమె ఏ సమాధనం చెప్పలేక కూర్చుంటుంది.
సూర్యునికి, ఆమెకు మొదట వైవస్వతడు (మనువు), తరువాత శ్రాద్ధదేవుడు, ఆ పిమ్మట యముడు-యమున అనే కవలపిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్యమీద మోహం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించిన సంజ్ఞాదేవి.. తననుండి ఛాయ అనే దానిని సృజించి, ‘‘నేను నా పుట్టింటికి వెళుతున్నాను. నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో వుండి నా భర్తను సంతోషపెట్టు. నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో’’ అని చెబితే.. ఆమె ‘‘తప్పనిసరి పరిస్థితులలోగాని చెప్పను’’ అని మాటిస్తుంది.
సంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగా.. తండ్రి ఆమె మందలిస్తాడు. ‘‘ఎలాంటివాడైనా భర్తను వదిలి సాధ్వియైన ఇల్లాలు వుండకూడదు’’ అని బుద్ధిచెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్తఇంటికి వెళ్లకుండా... ఒక ఆడగుర్రమైన కురుభూముతో పచ్చియబయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతుంటుంది.
ఛాయను సూర్యుడు తన భార్యే అనుకుని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికి సావర్ణుడు, శనైశ్వచరుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంటుంది. ఒకరోజు ఛాయ, తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకుని ఆమెను తన్నడానికి కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపంతో ‘‘నీ కాలు విరిగిపోవుగాక’’ అని శపిస్తుంది.
అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడు దగ్గరకు వెళ్లి, సవతి తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు. సూర్యుడు అతనిని ఓదార్చి ‘‘నాయనా! నువ్వు సత్యవంతుడివి, ధర్మమార్గనుడవు. అటువంటి నీకే కోపమొచ్చే విధంగా చేసిందంటే.. ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు. కాని నీ ధర్మప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నువ్వు విముక్తి పొందుతావు’’ అని అంటాడు.
తరువాత ఛాయను చూసిన సూర్యుడు.. ‘‘నువ్వు నీ పిల్లల మీద ఇంత బేధబుద్ధి చూపడానికి కారణమేంటి?’’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా వుంటుంది. సూర్యుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతుండగా.. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంజ్ఞకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకుని, మన్నించమని వేడుకుంటుంది.
సూర్యుడు ఆమె వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి, తన కుమార్తెను అప్పుడే బుద్ధిచెప్పి పంపించివేశానని చెబుతాడు. ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడిని మామ ఈ విధంగా చెబుతాడు... ‘‘అల్లుడా! ఒక మాట చెబుతాను విను. నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో దుర్భరంగా వుంది కదా... ఒక స్త్రీ, అందులో సుకుమారి ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో.. దీనిని అంగీకరించు’’ అని అనగా.. సూర్యుడు దానిని ఆమోదిస్తాడు.
అప్పుడు త్వష్ట సూర్యుని తిరిగెడు సానరాతి మీ అరుగదీస్తాడు. అలా అరుగుతీయడం వల్ల సూర్యుని తగ్గడం తగ్గడమేమోగానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. త్వష్ట, సూర్యుడిని అరుగుతీసినప్పుడు రాలిన తేజ కణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చాడు.
ఆ తరువాత సూర్యుడు సంజ్ఞను వెదకడానికి అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పచ్చికమేస్తున్న ఆడ గుర్ర రూపంలో తన భార్యే అని గుర్తుపట్టి... తను కూడా మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. అయితే ఆమె, తనను బలాత్కరించడానికి వచ్చిన మగగుర్రం అని భావించి, సూర్యుని తేజస్సును ముక్కనుండి బయటకు విసర్జిస్తుంది. అది రెండుచోట్ల పడగా.. దాని నుండి అశ్వనీదేవతలు పుట్టారు. వారే నాసత్యులని పిలువబడ్డారు. సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించి, ఆమెను సంతోషపరిచాడు.
సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యెను. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్యసావర్ణుడు కూడా మనువయ్యాడు. శనైశ్చరుడు గ్రహాలలో ఒక్కడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తున్నది.
ఎవరైనా ఈ సూర్యచరిత్రను విన్నా, పఠించినా వారు ఆపదలనుండి విముక్తడై ఆరోగ్య సంపదలను పొందుతాడు అని సూతుడు వారికి వివరించాడు.
కోణార్క సూర్యుడు
సూర్యుని ఆరాధించే విధానం :
ఉత్కళ దేశంలోని సముద్రతీరంలో సూర్యుడు ‘‘కోణార్కుడు అనే పేరుతో పిలవబడతాడు. మాసాలలోనే ఎంతో ఉత్తమమైంది ‘మాఘమాసం’. అందులో శుక్లపక్షంనాడు సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు రథసప్తమి వస్తుంది. ఇతనిని పూజించడానికి బ్రాహ్మణాది సకలవర్ణాలవారు భుక్తిముక్తులను కోరుకుని ఆరాధిస్తారు.
రథసప్తిమినాడు సముద్రస్నానం చేసి, అనుష్టానం తీర్చుకొని, భాస్కరుణికి అర్ఘ్యమిచ్చి బ్రహ్మయజ్ఞం, పితృతర్పణం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి, ఆ సముద్రతీరంలోనే తూర్పముఖంగా కూర్చుని, అష్టదళాల పద్మమైన ఎర్రచందనం కలిసిన నీటితో రాయాలి.
తరువాత ఒక రాగి పాత్రను తీసుకుని అందులో తిలలు, బియ్యం, ఎర్రచందనం కలిపిన నీటిని పోసి, ఎర్రని పూలు వుంచి, వానిపై దర్భలు కూడా వేయాలి. దానిమీద ఒక జిల్లేడు ఆకును వుంచి, దానిలో కూడా తిలతండులాదివస్తువులను వుంచి, ఆపైన ఇంకొక రాగి చెంబును నీళ్లతో నింపుకోవాలి.
ఇలా పూర్తయిన తరువాత కరన్యాసమును, అంగన్యాసమును యథావిధిగా చేసుకోవాలి. ఆగ్నేయనైరృతి, వాయు, ఈశానకోణాలలో భాస్కరునే ప్రధానదైవంగా భావించి, భాస్కరుని ఆవాహనచేసి కర్ణికాభాగాములో స్థాపించి, ముద్రాప్రదర్శన చేసి, పరమాత్ముని ధ్యానించుకోవాలి.
ఆపైన ఆరాధకుడు మోకాళ్లమీద కూర్చొని ఆ పాత్రను శిరస్సుపై వుంచుకొని, మళ్లీ పద్మంపై వుంచాలి. ఆపై మూడక్షరాల మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. దీక్షితుడు కానివాడు కూడా ఈ విధంగా సూర్యుడిని ఆరాధించవచ్చు.
యంత్రంలోని ఆగ్నేయంలో వున్న మూలాలన్ని మధ్యకర్ణికయందు, తూర్పు మొదలగు దిక్కులు అంటారు... ఊర్థ్వ అధోదిక్కులు అంటారు. కరన్యాసాదికమును, హృదయాదిన్యాసము చేసినట్లు భావించి, చివరికి ‘అస్త్రాయఫట్’ అని అస్త్రాన్ని పూజించి, ఆ తరువాత గంధధూపదీప నైవేద్యంతో సూర్యభగవానుడిని పూజించుకోవాలి.
వేదాలలో చెప్పినప్రకారం సౌరాష్టాక్షరీ మంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. తరువాత భూమిపై శిరము వుంచి నమస్కారాలు చేసుకోవాలి. భానువారం సప్తమి, మాఘమాసం కలిసివచ్చిననాడు ఈవిధంగా సూర్యారాధనం చేసి, నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి దారిద్ర్యం ఇళ్లలో వుండదు. ఆరాధకుడు సూర్యారాధనం చేసేరోజు ఉపవాసం వుండాలి.
సూర్యుని ద్వాదశమూర్తులు :
‘సుష్ఠు ఈరణం గతి: యస్యాసౌ సూర్య:’
కాలానికి అనుగుణంగా చక్కని గమనం కలవాడు కాబట్టి సూర్యుడు... అని,
‘సుష్ఠు ఈరణం ప్రేరణం యేనాసౌ సూర్య:’
సకల జీవరాసులకు మంచి చైతన్యం ఎవరిచేతో అయితే కలుగుతుందో అతడే సూర్యుడు,
అని సూర్యశబ్దాలు రచించబడ్డాయి. అంటే.. ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని దీనికి అర్థం. అతని వల్లే ఈ సృష్టి జరిగి, పోషించబడుతోంది.
‘‘యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభి: పర్జన్యోవర్షతి, పర్జన్యే నౌషది వన స్పతయ:
ప్రజాయంతే, ఓషది వనస్పతిభి రన్నంభవతి, అన్నేన ప్రాణా: అన్నాత్ పురుష:’’
అంటే... సూర్యుడు తన కిరణాలవల్ల తపింపచేస్తూ భూమ్మీద నీటిని ఆకర్షించి, నీటి మేఘాలలో నిలుపుతాడు. అప్పుడా మేఘాలు వర్షిస్తాయి. వర్షంచేత సస్యములు, వృక్షాలు మొలుస్తాయి, వాటివల్ల ఆహారం ఏర్పడుతుంది. ఆహారం నుంచే సమస్తప్రాణులు పుడతారు. కాబట్టి ప్రాణసృష్టికి మూలమైనవాడు సూర్యుడే .. అతడే పరతత్త్వము.
సూర్యుని రూపాలు :
1. ఇంద్రుడు : స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
2. ధాత : ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
3. పర్జన్యుడు : తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4. త్వష్ట : ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
5. పూష : ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
6. అర్యముడు : దేవతారూపంలో వుంటాడు.
7. భగుడు : ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
8. వివస్వంతుడు : ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.
9. విష్ణువు : శత్రువులను నాశనం చేస్తాడు.
10. అంశుమంతుడు : గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
11. వరుణుడు : జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
12. మిత్రుడు : లోకాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
ఈ సూర్యుడికి ఇంకా పన్నెండు పేర్లు వున్నాయి. వాటిని స్మరించుకుంటే.. మహాపాతకాలు నశిస్తాయి.
1. ఆదిత్యుడు; 2. సవిత; 3. సూర్యుడు; 4. మిహిరుడు; 5. అర్కుడు; 6. ప్రభాకరుడు; 7. మార్తండుడు; 8. భాస్కరుడు; 9. భానుడు; 10. చిత్రభానుడు; 11. దివాకరుడు; 12. రవి.
ఈ విధంగా సూర్యుడు పన్నెండు నామాలతో వుంటూ.. పన్నెండు మాసములలో ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ.. కాలచక్రాన్ని నడుపుతుంటాడు.
1. చైత్రమాసంలో ‘విష్ణువు’గాను
2. వైశాఖములో ‘అర్యముడు’గాను
3. జ్యేష్ఠములో ‘వివస్వంతుడు’గాను
4. ఆషాఢములో ‘అంశుమంతుడు’గాను
5. శ్రావణములో ‘పర్జన్యుడు’గాను
6. భాద్రపదంలో ‘వరుణుడు’గాను
7. ఆశ్వయుజంలో ‘ఇంద్రుడు’గాను
8. కార్తికంలో ‘ధాత’గాను
9. మార్గశిరంలో ‘మిత్రుడు’గాను
10. పౌష మాసంలో ‘పూష’గాను
11. మాఘమాసంలో ‘భగుడు’గాను
12. ఫాల్గుణమాసంలో ‘త్వష్ట’గాను సంచరిస్తూ.. లోకాలకు శుభాలను కలిగిస్తూ వుంటాడు.
మార్తండుడు :
సూర్యుడికి మార్తండుడు అనే పేరు రావడానికి ఒక కారణం వుంది. పూర్వం అదితి సంతానం కోసం కశ్యపునితో సంసారం చేస్తుంది. ఆమెకు రెండు అండాలు పుడతాడు. అందులో ఒక అండం పుట్టుకతోనే జీవం లేనిదిగా కనబడుతుంది. దాంతో ఆమె దానిని విసర్జింపచేస్తుంది. అయితే స్వప్రకాశంగల సూర్యుడు దానినుండి వెలువడుతాడు. మృతమైన అండంనుంచి వెలువడినవాడు కాబట్టి మార్తండుడు అని పిలవబడ్డాడు. ఇది ఒక కథ.
రెండవ కథ :
అదితి తన గర్భంలో సూర్యభగవానుడు జన్మించవలసిందిగా కోరి సూర్యారాధనం చేస్తుంది. కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితికి గర్భం కలుగుతుంది. అదితి ఉపవాసం, వ్రతాలతో చిక్కిపోవడం చూసి ఒకరోజు కశ్యపుడు కోపగించుకుని ‘‘ఇంత తపంచేసి చివరికి గర్భం పోగొట్టుకున్నావ్ ఎందుకు?’? అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు అదితి భర్త తనను పరిహానం చేస్తున్నాడని కోపంతో ‘‘ఈ గర్భం జారిపోతే లోకాలను సంరక్షించేలా వుండు’’ అని గర్భానుండి అండాన్ని జారవిడుస్తుంది. అది మహాతేజస్సుతో భూమిమీద పడుతుంది. మొదట అది మృతప్రాయమైనట్లు కనబడుతుంది. తరువాత వేయి సువర్ణకాంతులతో ఒక బాలుడు దాని నుంచి ఉదయిస్తాడు. అప్పుడు అదితి ‘‘నాథా! నువ్వు అండాన్ని మారణం చేసేస్తావా అని అడిగావు. అతడే ఇప్పుడు కొడుకుగా పుట్టాడు. కాని ఇతడు ‘మార్తండుడు’గా పిలవబడతాడు’ అని చెబుతుంది.
భూగోళం - వివరాలు :
మహామునులందరూ భూగోళం, దానిలోని వర్షద్వీపాదుల గురించి వివరించి చెప్పు అని కోరగా.. సూతుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘జంబూ ప్లక్షశాల్మలీ కుశక్రౌంచశాక పుష్కరములు అని ఏడు ద్వీపాలున్నాయి. ఇవి ఏడు సముద్రాలతో ఆవరించబడివున్నాయి. జంబూ ద్వీపం అన్ని ద్వీపాల మధ్యలో వుంటుంది. ఇందులోనే మేరు పర్వతం వుంది. అది సుమారుగా 12.18 కిలోమీటర్ల ఎత్తును కలిగి వుంటుంది. అది ఆకాశానికి 32 చదరపుమైళ్ల మేర విస్తరించి వుంటుంది. భూమికి అది నడిబొడ్డున వుంటుంది. దాని దక్షిణంవైపు హిమవంతం, హేమకూడమం, నిషధము అనే మూడు పర్వతాలు వున్నాయి. ఉత్తరాన నీల, శ్వేత, శృంగములు గల గిరులు వున్నాయి. ఆ పర్వతాలన్ని ఎంతో విశాలంగా, ఉత్తమమైనవిగా పేరు పొందాయి.
భారతము మొదటి వర్షం. హరికింపురుష వర్షాలు మేరువునకు దక్షిణాన వుంటాయి. దానికి ఉత్తరంగా రమ్యక హిరణ్మయవర్షాలు వున్నాయి. వీని మధ్య ఇలావృత వర్షం వున్నది. దీనిని మేరువు చుట్టివుంటుంది. దానికి తూర్పున మందరపర్వతము, దక్షిణాన కైలాస గంధమాదనములు, పశ్చిమాన విపులము, ఉత్తరాన సుపార్శ్వము అనే పర్వతాలు వుంటాయి. ఆ పర్వాతాలలో కదంబ, జంబూ, పిప్పల, వట వృక్షాలు పదకొండువేల యోజనాల (యోజన అంటే మైళ్లు) దాకా వ్యాపించి వుంటాయి. జంబూ వృక్షాలు వుండటం వల్ల దీనికి జంబూ పర్వతం అనే పేరు వచ్చింది. ఆ వృక్షాలు ఏనుగులు వున్నంత ఆకారంలో ఫలాలను కలిగి వుంటుంది. అవి రాలినప్పుడు వాని రసాలతో జంబూనది పుట్టి ప్రవహిస్తుంది. ఆ నదిలో మట్టి గాలికి ఆరి జంబూనదమని పిలువబడుతూ... స్వచ్ఛమైన సువర్ణంగా ప్రసిద్ధికెక్కింది. భద్రాశ్వ, కేతుమాలములు అనే వర్షాలు, మరవకములు, హరివర్షములు, జంబూనది మధ్యభాగంలో వెలిసి వున్నాయి.
మేరువు శిరస్సులో బ్రహ్మనిర్మితమైన ఒక మహానగరం వుంది. ఆ నగరానికి అష్టదిక్కులలో అష్టదిక్పాలకుల నగరాలు వున్నాయి. శ్రీహరి, భద్రాశ్వమంలో హయగ్రీవుడై.. కేతుమూలంలో వరాహమూర్తియై... జంబూ ద్వీపంలో కూర్మమూర్తియై... మేరు (కురవక) వర్షంలో మత్య్సమూర్తియై.. ఇతర వర్షాలలోను అనేక రూపాలను ధరించి విశ్వరూపుడై ప్రకాశించాడు.
ఒక జంబూ ద్వీపం తప్ప.. మిగిలిన ద్వీపాలన్ని దేవతానివాస యోగ్యములై వుండేవారు. అక్కడివారు ఆకలిగాని, వార్థకముగాని, రోగాలుగాని లేక పన్నెండు వేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి భోజభాగ్యాలతో తూగుతుండేవారు. కృత త్రేతాది యుగాల కాలప్రమాణాలు అక్కడ వుండవు.
భారత వర్షమునకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన సముద్రాలు వుంటాయి. తొమ్మిదివేల చదరపు యోజనాల వరకు దాని వైశాల్యం వుంటుంది. స్వర్గం, మోక్షం కోరుకునే వారికి ఇది కర్మభూమి వంటిది. మిగిలిన భోగభూములు అయిన మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమత్, ఋక్ష, వింధ్య, పారియాత్రములు ఏడు కులపర్వతాలు ఇక్కడ వున్నాయి. స్వర్గం, నరకం, మోక్షం అనేవి ఇక్కడున్నవారి కర్మాచరణం కాబట్టి ఇవన్నీ కలుగుతుంటాయి. ఇక్కడ తప్ప మరేచోట కర్మాచరణం అనేది లేనేలేదు.
ఇంద్ర, కశేరు, తామ్ర, గభస్తిమత్, నాగ, సౌమ్య, గంధర్వ, వారుణ అనే భారతములు నవఖండాలుగా ఈ భరతవర్షం విభజించబడింది. మన భారతఖండం ఇందులో తొమ్మిదవది. దీని మూడువైపులా సాగరములు వుంటాయి. ఇది వేయి చదరపు యోజనాల వరకు వైశాల్యాన్ని కలిగి వుంటుంది. దీనిలో తూర్పుభాగాన కిరాతులు, పశ్చిమాన యవనులు వుంటారు. మధ్యభాగాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణాలవారు నివసిస్తారు. వేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతర శాస్త్రాలు ఇక్కడ వృద్ధిచెంది వ్యాపిస్తాయి.
గంగ, యమున, సరస్వతి, సింధు, గోదావరి, నర్మద, కృష్ణవేణి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి మొదలైన నదులు, వాటి ఉపనదులతో కలిసి ప్రవహించి, సాగరంలోకి కలిసిపోతాయి. తూర్పుదేశ నివాసులు, కామరూప దేశస్థులు, పౌండ్ర, కళింగ, మగధ, దాక్షిణాత్యులును, సౌవీర, సైంధవాది దేశవాసులు, మంద్ర, ఆరామ, అంబష్ఠ, పారశీక నివాసులు, ఈ మహానదులనుంచి ప్రవహించే జలాన్ని త్రాగుతూ... వాటి వల్ల నాలుగు పాడిపంటలతో సంపన్నులు అవుతూ సంతోషంగా కాలాన్ని గడుపుతారు.
భారతవర్ష ప్రశస్తి :
ఈ భారతవర్షంలోనే... కృత, త్రేతా, ద్వాపర, కలియుగమనే నాలుగు యుగాలు నడుస్తాయి. ఇక్కడ నివసించేవారిలో కొందరు సన్యాసులై తపము చేసుకుంటారు. మరికొందరు యజ్ఞగాదులతో దేవతలకు సంతృప్తి కలిగిస్తారు. కొందరు పరలోక సుఖాలను పొందడం కోసం ధర్మాలు చేస్తారు. పరలోకంలో ఉత్తమగతులు పొందడానికి కూడా దానధర్మాలు చేస్తారు. యాచకులైనవారు ఏమీ లేదనకుండా దానాలు చేస్తారు. వేదాలను చదువుతారు. వారి శిష్యులకు పాఠాలు చెబుతారు. చెరువులు త్రవ్వించడం, గుళ్లుగోపురాలు కట్టించడం, బావులు తవ్వించడం మొదలైన లోక ఉపకార ధర్మకార్యాలను చేస్తారు. ఇటువంటివన్ని ఇతర వర్షములలో జరగవు.
అక్కడ వుండేవారికి ఆచరణీయములగు సిద్ధలు వేరే వున్నాయి. వారికి, వీరికి ఎటువంటి సంబంధం వుండదు. జంబూ ద్వీపంలో కొన్ని వేల జన్మలలో చేసిన పుణ్యఫలాలకుగాను మానవజన్మ దొరుకుతుంది. భారతఖండవాసులు ఎంతో ధర్మాత్ములని, స్వర్గమోక్షాలకు కారణమైన కర్మలను ఆచరించదగిన జన్మమెత్తినవారని.. దేవతలు వీరిని చూసి అభినందిస్తారు. ఈ కర్మభూమిని మించి మరొకటి లేదని చెబుతారు.
ప్లక్షాది ద్వీపాలు :
ప్లక్షద్వీపం కూడా జంబూ ద్వీపంలానే ఉప్పు సముద్రం చేత ఆవరించబడి వుంటుంది. జంబూ ద్వీపంకంటే రెట్టింపు వైశాల్యం కలిగి వుంటుంది. దీనికి మొదటిరాజు మేధాతిధి. అతనికి శాంతిమయుడు, శశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనే ఏడుగురు కొడుకులు వుండేవారు. వీరి పేర్లమీదే ఇక్కడ ఏడు వర్షములు ఏర్పడ్డాయి. ఇక్కడ గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస్, వైభ్రాజములనే కులపర్వతాలు కలవు. దేవగంధర్వులనే ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వారికి మనస్తాపాలు, రోగాలు వుండక... సౌఖ్యానుభవమే వారికి సహజం.
అనుతప్త, శిఖి, విపాశ, త్రిదివ, క్రమునామక, అమృత, సుకృత అనే ఏడు నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తాయి. ఈ నదులపేర్లు స్మరించుకోవడం వల్ల సకలపాపాలు నశించిపోతాయి. ఇక్కడ యుగావస్థలు లేవు. ఎల్లప్పుడూ త్రేతాయుగంలో వుండే ధర్మాలే నడుస్తుంటాయి. ప్రజలు 5వేల సంవత్సరాల వరకు జీవిస్తారు. ఆర్యక, కురు, వివిశ్వ, భావి నామాలతో నాలుగు వర్ణాల వారు ఇక్కడ వుంటారు. ప్లక్షవృక్షాలు (జువ్విచెట్లు) వుండటం వల్ల ఈ దీవికి ప్లక్షద్వీపమని పేరు వచ్చింది.
శాల్మలద్వీపం :
దీనికి పాలకుడు వీరుడు. ఇందులో కూడా శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభము అనే ఏడు వర్ణాలు వున్నాయి. శాల్మల (బూరుగు) వృక్షాలుండటం వల్ల ఈ ద్వీపానికి శాల్మలద్వీపం అనే పేరు వచ్చింది. చెరుకురస సముద్రం ఈ ద్వీపం చుట్టు ప్రవహిస్తుంది. ఉన్నతము, మూహకము, ఓషధీ నిలయమైన ద్రోణము, కంకము, మహిషము, కుకుద్మంతము అనే పేరుగల కులపర్వతాలు ఇక్కడ వున్నాయి.
శ్రేణి, తోయ, వితృష్ణ, చక్ర, శుక్ర, విమోచని, నివృత్తి అనే ఏడునదులు ఇక్కడ ప్రవహిస్తాయి. కపిలులు, అరుణులు, పీతవర్ణులు, కృష్ణవర్ణాలు అనే పేరులతో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను చతుర్వర్ణాలవారు వుంటారు. వారు విష్ణువును పూజించుకుంటారు. యజ్ఞయాగాలు చేసే ఉద్దేశ్యం కలిగినవారు, వాయుభూతునిగా భగవంతుడిని ఆరాధించి.. అతనికి ప్రీతిగా యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ వుండేవారు 5వేల సంవత్సరాలవరకు జీవిస్తారు.
కుశద్వీపము :
ఈ ద్వీపం సురా సముద్రంతో ఆవరింపబడి వుంటుంది. శాల్మల ద్వీపం కంటే ఇది రెట్టింపు వైశాల్యాన్ని కలిగి వుంటుంది. ఇందులో కూడా ఏడు వర్షములు వున్నాయి. ఉద్భిదము, వేణుమంతయు, వితతము, రంధనము, ధృతి మొదలైన పర్వతాలు ఇక్కడ వున్నాయి. దేవదానవులతో పాటు కొందరు పుణ్యాత్ములైన మనుష్యులు, గంధర్వలు కూడా వుంటారు.
దమి, శుష్మి, స్నేహ, మందేహ నామములతో బ్రహ్మన, క్షత్రియ, వైశ్య, శూద్రులు వుంటారు. వీరు బ్రహ్మరూపుడైన జనార్ధనుడిని పూజిస్తారు. ధృతపాప, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుత్తు, అంభస్తు, మహి అనే ఏడు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. కుశస్తంభాలు (దర్భకాడలు) ఎక్కువగా వుండటం వల్ల దీనికి కుశద్వీపం అనే పేరు వచ్చింది.
క్రౌంచద్వీపము :
ఇది కుశద్వీపం కంటే రెట్టింపు వైశాల్యం కలిగి వుంటుంది. దీని చుట్టూ నేతి సముద్రం వుంటుంది. కుశగము, రుందము, గోష్ఠము, పీవరము, అంధకారకము, భూరిరూపము, దుందుభి అనే ఏడు వర్షములు వుంటాయి. క్రౌంచము, వామనము, అంధకారకము, దేవవ్రతము, ధమము, పుండరీకవంతము అనే ఏడు కులపర్వతాలు ఇక్కడ వున్నాయి.
ఒక ద్వీపం, వర్ష పర్వతాలు, సముద్రాలు, ఆవలనింకొక ద్వీపంగా.. ఈ ద్వీపాలన్ని భూమండలమున అమరి వుంటాయి. అక్కడ దేవగణములు ప్రజలుగా వుంటారు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీకము అనే పేర్లు గల నదులు ప్రవహిస్తూ వుంటాయి. ఆ నదీ జలాలను త్రాగినవారు ఆరోగ్యభాగ్యాలు పొందుతారు.
శాకద్వీపము :
శాకద్వీపాధిపతికి ఏడుగురు పుత్రులు వుండేవారు. వారిపేర్లు.. జలదుడు, కుమారుడు, సుకుమారుడు,మనీరకుడు, కుసుమయోదుడు, మోదకి, మహాద్రముడు. వీరి పేర్లతో ఆ శాకద్వీపంలోవున్న వర్షములు ప్రఖ్యాతి పొందాయి. ఏడు కులపర్వతాలు వున్నాయి. అవి... ఉభయగిరి, జలధారము, రైవతకము, శ్యామము, దంభోగిరి, ఆస్తికోయము, కేసరి మొదలైనవి. శాకవృక్షాలు అధికంగా వుండటంవల్ల దీనికి శాకద్వీపము అనే పేరు వచ్చింది. ఇక్కడకూడా నాలుగు వర్ణాలవారు వుంటారు. వారికి బద్ధకముగాని, జఢత్వంగాని అస్సలు వుండదు... వ్యాధులుండవు. మంచి స్వభావంతో, కాంతిగల దేహాలతో అక్కడి ప్రజలు మైత్రితో కలిసిమెలసి వుంటారు.
అక్కడ సమస్తపాపాహారములు, పుణ్యప్రదమైన నదులు ఏడు వున్నాయి. అవి.. సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి మొదలైనవి. అక్కడున్న ప్రజలకు అధర్మం, దు:ఖము, అనారోగ్యము అంటే ఏమిటో తెలియదు. వారు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ వుంటారు. మగములు, మగధములు, మానసములు, మంగములు అనే నాలుగు వర్ణాలవారు ఈ ద్వీపంలో వుంటారు.
పుష్కరద్వీపము :
ఈ ద్వీపం శాకద్వీపం కంటే రెట్టింపు ప్రమాణం కలిగి వుంటుంది. దీనికి అధిపతి సవనుడు. అతనికి మహావీతుడు, ధాతకి అనే ఇద్దరు కొడుకులు వుండేవారు. వారిద్దరి పేర్లమీద ఇక్కడ రెండు వర్షములు వెలిశాయి. అక్కడ మానసోత్తరమనే మహాపర్వతం వుంది. అది మహావీ, ధాతకీ వర్షములను రెండు భాగాలుగా విభజించేందుకు మహాపర్వతము గలదు. అక్కడి ప్రజలు పదివేల వర్షములు వరకు జీవిస్తారు. వారికి రోగాలుండవు.. శోకముండదు.. రాగద్వేషాలు వుండవు... వీరు అధములు వారు ఉత్తమములు అనే వర్గభేదాలుండవు. ఇక్కడ సురులు, అసురులు, యక్షులు పరస్పరం మైత్రితో మెలుగుతుంటారు. అసత్యంగాని, అనృతముగాని అక్కడ లేదు. అక్కడ కులపర్వతాలు, నదులు కూడా లేవు.
పుణ్యపురుషులు దేవతల వేషాలు ధరించి వారితో సమానంగా వుంటారు. అక్కడ వర్ణాశ్రమాచారములు లేవు. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే భేదాలుండవు. ముసలితనం వుండదు. అదే స్వర్గమని పిలువబడుతుంది. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం గలదు. ఆ చెట్టు మొదట బ్రహ్మ తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. దీని చుట్టూ మంచినీళ్ల సముద్రం ఆవరించి వుంది.
ప్రజలు వారు కోరనంత భోజనమే లభ్యమవుతుంది. అక్కడి నేలంతా బంగారం రూపంలోనే వుంటుంది. జంతువులు ప్రజలను బాధింపవు. దాని తరువాత చక్రవాళశైలము వుంది. అది పదివేల యోజనముల పొడవు గలది. అది అంధకారములో వుంటుంది. అందువల్ల అది జనకులకు కనిపించదు. క్రౌంచద్వీపంగాక, ఇతర ద్వీపంలో వున్న సముద్రాలకు ఆటుపోట్లుంటాయి. శుక్లపక్షకృష్ణ వృక్షములో చంద్రుని వృద్ధి క్షయములను బట్టి ఇవి వృద్ధిక్షయములను పొందుతాయి. క్రౌంచ ద్వీపాన్ని చుట్టియున్న సముద్రానికి అటువంటి ఆటుపొట్లు వుండవు.
ఈ విధంగా సప్తద్వీపాలతో కూడిన భూమండలం కొలత ఏబదికోట్ల యోజనాలు వుంటుంది. ఆ భూమియే సర్వప్రజలకు, జంతుజాలమునకు, నదీనదారణ్య సముద్రాదులకు ఆధారమని గ్రహించాలి’’ అని సూతుడు చెప్పగా.. అక్కడున్న మునులందరు విని ఎంతో సంతోషించారు.
రుద్ర మహాత్యము - గౌరీ శంకరులు :
ఈశ్వరుని మహిమ గురించి వివరిస్తూ.. సూతుడు ఈ విధంగా అంటాడు.. ‘‘ఓ మునులారా! ఈశ్వరుని మహిమ ఇంత అని చెప్పలేము. ఆయన గురించి చెబుతాను వినండి’’...
‘‘దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరుడు వివాహమాడాడు. అయితే దక్షునికున్న అల్లుళ్లలాగా ఈశ్వరుడు సంపన్నుడు కాదని చిన్నచూపుతో చూస్తుంటాడు. ఒకరోజు దక్షడు యజ్ఞం చేయడానికి సతీదేవిని తప్ప తన కుమార్తెలందరిని పిలిచి.. వారికి వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి సంతోషపరిచాడు. ఈ విషయం తెలిసుకున్న సతీదేవి.. వెంటనే తన తండ్రి ఇంటికి వెళుతుంది. అక్కడికి చేరుకున్న సతీదేవిని చూసి ఆమె తండ్రి అయిన దక్షుడు పలకరించకుండా వుంటాడు.
అప్పుడు సతీదేవి రోషంతో.. ‘‘తండ్రీ! నేను కుమార్తెలోకెల్లా పెద్దదానిని. ఇంతమంది ముందు నువ్వు నన్ను చులకన చేయడం యుక్తం కాదు’’ అని అంటుంది. దక్షుడు కూడా కోపంతో.. ‘‘నా పుత్రికలందరూ గుణవంతులు.. నా అల్లుళ్లు కొందరు తపోనిష్టులు, మరికొందరు మహైశ్వర్య సంపన్నులు. నాతో వీరందరూ గౌరవభావంతో వుంటారు. కానీ నీ భర్త అయోగ్యుడు.. నన్ను అస్సలు గౌరవించడు.. నమస్కరించడు కూడా! మిగతావారితో కూడా సఖ్యతగా ప్రవర్తించడు. అటువంటి శివునితో సంబంధం వుండటం వల్ల నువ్వు కూడా అనిష్టురాలివే’’ అని అంటాడు.
అది విన్న సతీదేవి.. ‘‘నువ్వు మహోన్నతమైన - పరమపురుషుడైన నా భర్తను, నన్ను దూషించావు. కాబట్టి నీవల్ల జన్మించిన ఈ దేహాన్ని ఇప్పుడే విడుస్తున్నాను’’ అని తన తండ్రితో అంటూ.. మనసులో..‘‘నేనుప్పుడైన సతీత్వధర్మాన్ని ఆశ్రయించివుంటే మళ్లీ నన్ను శంకరుడే పతి అవుగాక’’ అని ధ్యానిస్తూ.. తన శరీరాన్ని అక్కడున్న యోగాగ్నిలో భస్మం చేస్తుంది.
సతీదేవి భర్త అయిన శంకరుడు ఈ వృత్తాంతం గురించి తెలుసుకుని... ‘‘ఈ మునులందరూ వైవస్తవమన్వంతరంలో మానవులై అయోనిజులుగా పుడతారు. నీ యజ్ఞసమయంలో వచ్చి, ఋత్విజులై సభముందే శివపత్ని అవమానంతో దేహత్యాగం చేస్తుండగా.. మీరందరూ ఊరికే వుంటూ చూసినందుకు ఈ శాపాన్ని భరించాల్సి వుంటుంది. ఇంకా దక్షుడు ఆ మన్వంతరంలో వున్న ప్రాచీనబర్హికి పుత్రుడైన ప్రచేతసుడు అనే రాజుకు పుత్రుడుగా జన్మిస్తాడు. అప్పుడు అతను చేసే యజ్ఞాలను నేను ధ్వంసం చేస్తాను. ఏ ధర్మకార్యం చేయబోయినా.. దానికి అడ్డుపడి నాశనం చేస్తాను’’ అని శపిస్తాడు.
దక్షుడు దీని గురించి తెలుసుకుని.. ‘‘ప్రజలు యజ్ఞయాగాదులు చేస్తూ.. హవిర్భాగాలు ఇచ్చినప్పుడు నిన్ను విడుస్తారు. ఒకవేళ నీకు ఆహుతి ఇయ్యక తప్పనిసరి అయితే.. ఇచ్చిన వెంటనే చేతులు అపవిత్రులైనట్లు భావించి నీళ్లతో కడుక్కుంటారు’’ అని శపిస్తాడు. అప్పుడు రుద్రుడు.. ‘‘దేవతలతోబాటు హవిర్భాగములు పుచ్చుకోవడం నేనిష్టపడను. నాకు చెందవలసింది నేను వేరుగా తీసుకుంటాను. లోకాలలోకెల్లా భూలోకం ఎంతో ఉత్తమమం. నేను భూలోకంలో వుంటే దానికి స్థిరత్వం కలుగుతుంది. నేను అక్కడే వుంటాను.. కానీ నీకు భయపడి మాత్రం కాదు’’ అని అంటాడు.
శివుని శాపంవల్ల దక్షుడు భూమిలో పుడతాడు. దక్షశంకరులకు ఈ శాపాలు శాశ్వతంగా మారిపోతాయి. దక్షుని జన్మం మారినా.. వైరం వాసనారూపంగా అతనిని విడకుండా వుండేది’’ అని సూతుడు మునులకు చెబుతాడు.
సతీశంకరుల వృత్తాంతం :
మునులు, సూతుడిని సతీశంకరుల వృత్తాంతం గురించి వివరించుము అని అడగగా.. ‘‘ఈ కథ ఇంతకుముందు బ్రహ్మ.. మహర్షులకు చెప్పాడు.. అదే మీకు వివరిస్తాను వినండి’’.. అని సమాధానం ఇస్తాడు.
హిమవంతుడు అనే ఒక పర్వతరాజు వుండేవాడు. అతని భార్య మేన. అతనికి ఎంత ప్రయత్నించినా సంతానం కలుగలేదు. ఒకరోజు కశ్యప్రజాపతి వీరికి ఇంటికి చేరుకుంటాడు. రాజు అతనికి మర్యాదలు చేసి ఇలా అంటాడు.. ‘‘ఓ మునీంద్రా! దేనివల్ల అక్షయపుణ్యలోకాలు కలుగుతాయి? దేనివల్ల కీర్తి ప్రాభవాలు కలుగుతాయి? దానికి సంబంధించిన విషయాలుఏంటో వివరించండి...’’ అంటూ కోరుకుంటాడు.
అప్పుడు ఆ కశ్యపుడు.. ‘‘నాకు ఉత్తమ కుమారులు (దేవతలు) జన్మించడం వల్ల నాకు ప్రజాపతిత్వం, గౌరవం కలిగింది. నువ్వు కూడా తపంచేసి సంతానభాగ్యాన్ని పొందు’’ అని చెప్పి వెళ్లిపోతాడు.
అప్పుడు హిమవంతుడు బ్రహ్మకోసం తపం చేయగా.. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ‘‘నీకు ఒక కొడుకు, కుమార్తెలు జన్మిస్తారు. ఆ కూతురివల్ల నువ్వు కీర్తిమంతుడివి అవుతాయి. ఆమె దేవలతో కూడా నమస్కరింపబడుతుంది’’ అని వరమిస్తాడు.
ఆనాడు యోగాగ్నిలో తన శరీరాన్ని దహించజేసుకున్న శివుడి భార్య అయిన సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె ‘ఉమ’ అనే పేరుతో పిలువబడుతుండేది. ఆమె మహానుభావురాలు. ఆమె ఆత్మ కూడా మూడు విధాలుగా రూపొందించబడింది. అపర్ణ, ఏకపర్ణి, ఏకపాటలు అని ఆ ఆత్మల పేర్లు. అందులో అపర్ణయే ఉమ.
ఉమ శంకరుని విడిచివుండలేక మహాతపస్సు చేయడానికి బయలుదేరుతుండగా.. తల్లి ఆమెను నివారించి ‘తపము వద్దు’ అని అంటుంది. కాని ఆమె నిశ్చయంగా చేయాల్సిందేనని చెప్పి.. తల్లి అనుమతి తీసుకుని వెళుతుంది. ఆమెతోపాటు ఏకపర్ణి, ఏకపాటలు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ ముగ్గురే లోకమాతలు.
ఉమ మహాదేవుడిని ఆశ్రయిస్తుంది. ఆమె తపస్సుకు లోకాలు కూడా హాహాకారం చేశాయి. అప్పుడు బ్రహ్మ ఆమె తపస్సుకు ప్రసన్నుడై.. ‘అమ్మా! నువ్వు జగజ్జననివి. నీవల్ల ఈ లోకాలు నశింపరాదు. దయచేసి నీ తపమును చాలించు’ అనగా... ఆమె ‘‘పితామహా! నేను ఏమికోరి తపము చేస్తున్నానో నీకు తెలియదా?’’ అని సమాధానం ఇస్తుంది.
అప్పుడు బ్రహ్మ...‘అమ్మా! నువ్వు కోరినవాడు వెదుక్కుంటూవచ్చి నిన్ను వరిస్తాడు. ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడో తెలియదు. మేము శివుని చరణసేవలం’’ అని అంటాడు. మునులు ఆమె దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వు కోరుకున్న శంకరుడే నీకు పతిగా వస్తాడు. ఇంక నీ తపమును చాలించు’’ అని కోరుకుంటారు.
ఒకనాడు ఒక వామనుడు అక్కడికి చేరుకుంటాడు. అతని కాళ్లు, చేతులు చాలా పొట్టివి. తల కూడా తుప్ప లాగా వుండేది. ముక్కు వంకరగా తిరిగివుంటుంది. ఏవైపు నుంచి చూసినా.. చాలా అసహ్యంగా వుండేవాడు. అతడు మెల్లగా పార్వతి దగ్గరకు వచ్చి.. ‘ఉమా! నిన్ను వరించడానికి నేను వచ్చాను’’ అని పలుకుతాడు. పార్వతి అతనిని తన యోగమహిమవల్ల పరమశివునిగా గుర్తిస్తుంది.
పార్వతి అతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి.. ‘‘స్వామీ! నేను స్వతంత్రురాలిని కాను. నన్ను ఇవ్వడానికి నా తండ్రి వున్నాడు. నా తండ్రి ఆమోదిస్తే.. నేను నీతో వివాహమాడుతాను’’ అని పలుకుతుంది. ఆమె పలికిన మాటలకు సంతోషించి ఆ కపట వేషధారి.. ‘‘అయితే నేను హిమాచలాధీశునే అడుగుతాను’ అని వెళ్లి.. హిమవంతునిచేత పూజితుడై.. తనకు అపర్ణను ఇవ్వమని అడుగుతాడు.
హిమవంతుడు ఆలోచనలో పడతాడు. ‘‘ఇతని రూపం పరమవికారంగా వుంది. ఇతనికి నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? కాదన్నా ఇతడు శపించి వెళతాడేమో’ అని తలచుకుని.. ఆ వామనునితో ఇలా అంటాడు.. ‘‘అయ్యా! నువ్వు నా కుమార్తెను ఇవ్వమని అడుగుతున్నావు. నేను నా కుమార్తెకు స్వయంవరం చాటింతమని కోరుతున్నాను. నువ్వు ఆ స్వయంవరానికి రా... అక్కడ నీ అదృష్టాన్ని పరీక్షించుకో’’ అని అంటాడు.
ఈ మాటలు విన్న ఆ కుబ్జుడు, పార్వతీ దగ్గరకు వెళ్లి.. ‘‘అపర్ణా! నీ తండ్రి నీకు స్వయంవరం చాటిస్తున్నాడు. అందులో నువ్వు ఎవరినైతే వరిస్తావో అతడే నీ భర్త అవుతాడట. ఈ సంగతి చెప్పి వెళదామని నీ దగ్గరకు వచ్చాను. మన్మథునిలాంటి వాడినే నువ్వు వరిస్తావుగాని.. నాలాంటి వికృతరూపంగల వాడిని ఎలా వరిస్తావు? సెలవిస్తే నేను బయలుదేరుతాను’’ అని అంటాడు.
ఉమ అతడు చెప్పింది విని.. ‘‘ఓ స్వామీ! నిన్ను నేను శంకరునిగా గుర్తించాను. నాపై నీకున్న అనురాగానికి సంతోషించాను. నేను ఎవ్వరినో ఎందుకు కోరుకుంటాను? నువ్వే నా భర్తవు. నీకు విశ్వాసం కలగాలంటే.. ఇప్పుడే నేను నిన్ను వరించుకుంటాను’’ అంటూ.. ఒక పుష్ఫహారాన్ని ఆ నీలకంఠుని మెడలో వేస్తుంది.
అప్పుడు అతడు.. ‘‘నువ్వు నన్ను ప్రీతితో వరించావు కాబట్టి నీకు ముసలితనం, మరణం లేకుండా వరాన్నిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ వనం ఇకనుంచి చిత్రకూటమని పిలువబడుతుంది. ఈ వనానికి వచ్చి దేవపూజకోసం ఎవరైతే పుష్పాలను కోస్తాడో.. అతడు అశ్వమేధఫలాలను పొందుతాడు. ఎవడు ఈ గిరిశిఖరమున తపము చేసి ప్రాణాలు విడుస్తాడో.. అతడు ప్రమథగణంలో ముఖ్యుడవుతాడు’’ అని అంటాడు.
పార్వతి ఆ పర్వతశికరం దగ్గరే కూర్చుని పరమేశ్వరుని ధ్యానిస్తుంటుంది. ఆ పర్వత శిఖరానికి సమీపంలో ఒక తామర చెరువు గలదు. ఒకరోజు శివుడు ఒక బాలకుని రూపంలో ఆ చెరువులోదిగి బాలక్రీడలు ఆడుతుండగా.. అందులో వున్న మొసలొకటి అతనిని పట్టుకుంటుంది. ఆ బాలుడు పెద్దగా అరుపులు పెడుతూ ఏడుస్తుంటాడు. అదివిన్న పార్వతి ఆ కొలను దగ్గరకు వెళ్లి చూస్తుంది. ‘‘అయ్యో! ఈ మొసలి నన్ను పట్టుకుంది. ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి నన్ను కాపాడండి? నేను నా తల్లిదండ్రుల గురించి విచారిస్తున్నాను. వారికి నేనొక్కడినే పుత్రుడ్ని. నా మరణవార్త విని వాళ్లు కూడా మృతిచెందుతారు. దైవనిర్ణయాన్ని కాదని చెప్పేవాళ్లు ఎవరు? అని విచారిస్తుంటాడు.
అక్కడకు చేరుకున్న పార్వతి ఆ మొసలితో.. ‘‘ఓ నక్రమా! నీవెందుకు ఈ బ్రాహ్మణవటువును మింగుతున్నావు? కనికరించి అతనిని వదిలిపెట్టు’’ అనగా.. మొసలి ‘‘తల్లీ! ఇక్కడికి వచ్చే ఏ ప్రాణినైనా భక్షించి జీవనాన్ని గడుపుమని బ్రహ్మ నాకు చెప్పాడు. ఈరోజు నాకు ఈ బాలుడు దొరికాడు. ఎలా వదలగలను?’’ అని అంటాడు. అప్పుడు పార్వతి.. ‘‘ఓ జలచరమా! నేను హిమవంతుని పుత్రికను. నేను ఇన్నాళ్లూ చేసిన తపము నీకిస్తాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని అంటుంది.
ఆ మాటలు విన్న మొసలి.. ‘‘నువ్వు ఉత్తమంగా భావించే తపము కొంచెమైనా నాకివ్వు’’ అనగా.. పార్వతి ‘‘నేను పుట్టినప్పటినుండి ఏ పుణ్యాలు చేశానో.. ఆ పుణ్యాలు వాటి ఫలాలు నీకిచ్చేస్తున్నాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని కోరుకుంటుంది. అందుకు మొసలి.. ‘‘ఉమాదేవీ! ఇంత కష్టపడి చేసిన తపమును వదులుకుంటున్నావా? పెద్దలు వింటే నిన్ను మెచ్చుకోరు’’ అని అంటాడు.
పార్వతి తిరిగి ఘోరతపస్సు చేయడం ప్రారంభిస్తుంది. పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమై.. ‘‘అపర్ణా! నువ్వు చేసిన తప: ఫలమును ధారపోయగా.. దానిని నేను గ్రహించాను. అది నీకు అక్షయమైన ఫలితాలనిస్తుంది. ఇక ఈ తపము చాలించు’’ అని పలుకగా.. పార్వతి తన తపము ఫలించినందుకు చాలా ఆనందిస్తుంది.
పర్ణమనగా.. ఆకులు. తపముచేసేవారు ఆకులు, ఆలములు తింటారు. ఈమె తపము చేసేటప్పుడు ఆకులు కూడా తినకుండా ఉపవాసముండేవి. మునులు ఈమెను అపర్ణ అని పిలిచారు.
పార్వతీ స్వయంవరం :
ఆనాడు హిమవత్ పర్వత రాజు రాజధాని అయిన ఓషధిప్రస్థము చాలా సందగిడా వుండేది. ప్రతిఒక్కరు పార్వతీ స్వయంవర మహోత్సవ గురించే మాట్లాడుకునేవారు. రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నదని తెలుసుకుని... అక్కడి ప్రజలు కూడా విచ్చేశారు.
పార్వతి కైలాసవాసునిని వరించిందన్న విషయం హిమవంతునికి తెలుసు. తన వద్దకు వికారరూపంలో వచ్చి, పార్వతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరినవాడు కూడా ఈశ్వరుడేనన్న అనుమానం కూడా లేకపోలేదు. అయినా.. తాను మొదట ఉద్దేశించుకున్న ప్రకారమే స్వయంవరం కార్యక్రమం పూర్తి చేయాలని నిశ్చయించుకొన్నాడు.
పార్వతీ స్వయంవరాన్ని భూలోకంలోని స్వర్గాది సర్వలోకాలలో నిర్వహించుకున్న హిమవంతుడు... బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, ఇంద్రాది దిక్పాలకులను, వసువులు, ఆదిత్యులు మొదలైనవారందరినీ ఆహ్వానించాడు.
స్వయంవరంరోజు ఇంద్రుడు మహావైభవంతో ఐరావతమెక్కి వచ్చాడు. నీలశరీరకాంతితో మహిషమెక్కి యమధర్మరాజు వచ్చాడు. వరుణుడు, కుబేరుడు తగిన పరివారములతో హాజరయ్యారు. గరుత్మంతునిపై ఎక్కి పీతాంబరంతో, శంఖచక్కాది లాంఛనాలతో శ్రీ మహావిష్ణువు, హంసవాహనంపై బ్రహ్మలు అక్కడికి చేరుకున్నారు. గంధర్వరాజైన చిత్రరథుడు విమానమెక్కి చేరుకున్నాడు.
స్వయంవరానికి సమయం ఆసన్నమైంది. ఇంతమంది వచ్చినా... కైలాసగిరి నుంచి పరమేశ్వరుడు ఇంకా హాజరు కాలేదు. పార్వతి సభాభవనంలోకి పుష్పమాలిని చేతిలో పట్టుకొని వచ్చి... ఒక ఆసన్నంపై కూర్చుంది.
ఇంతలో ఒక శిశువు పార్వతీ ఒడిలో వాలిపోతాడు. అప్పుడు పార్వతి తన యోగశక్తి వల్ల ఆ శిశువే పరమేశ్వరుడు అని తెలుసుకొని.. అతని మెడలో హారమువేసి వరిస్తుంది. అయితే అక్కడున్న ఇంద్రాదిదేవతలు ఆ బాలుడే పరమేశ్వరుడని తెలియక క్రోధావిష్టులవుతారు.
అప్పులో మొదటివాడైన దేవేంద్రుడు... ఆ బాలుడిని వజ్రాయుధంతో కొట్టబోతాడు. కానీ.. అతని సర్వాంగములు స్తంభించి.. శిలాప్రతిమలాగా మారిపోతాడు. భగవానుడు కూడా అలాగే మారిపోతాడు.
అదిచూసిన విష్ణుమూర్తి.. ఆ బాలుడే శంకరుడు అని గ్రహిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా... దేవతల యోగబలాన్ని స్తంభింపచేసే ఇతడెవరోనని కొద్దిసేపు చింతించి.. ఆ తరువాత ఆ కుమారుని పరమశివునిగా తెలుసుకుని స్తోత్రాలు చేస్తాడు.
‘‘పరమపురుషుడైన నువ్వు.. కీడుతలపెట్టిన మూర్ఖులకు తగిన శిక్షయే లభించింది’’ అని పలుకుతూ... ఇంద్రాది దేవతలను ‘‘మీరు మహాదేవునికి అపకారం తలపెట్టారు. అది మీకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఆ మహేశ్వరుని భక్తితో సేవించండి’’ అని హితం పలుకుతాడు.
అప్పుడు ఆ ఇంద్రాది దేవతలు ఈశ్వరుడిని మనసులో ధ్యానించుకుంటారు. శంకరుడు దయామయుడు కాబట్టి.. వారి దురవస్థను మాన్పించి.. బాలడి రూపాన్ని వదిలేసి, మనోహరమైన రూపాన్ని ధరిస్తాడు. హిమవంతునితో సహా అందరూ దేవతలు ఆయనకు ప్రణామములు ఆచరించారు.
అక్కడున్న సభ్యులందరూ హిమవంతునితో... ‘‘ఇటువంటి మహానుభావుడు నీకు అల్లుడు అయినందుకు నీ జన్మం ధన్యమైంది. ఇక పెళ్లి ఏర్పాటు త్వరగా చేయండి’’ అని అంటారు.
పర్వతరాజు బ్రహ్మను చూసి... ‘‘అన్నింటికీ నీవే ముఖ్యుడివి. కాబట్టి బ్రహ్మత్వం వహించి.. నువ్వే ఈ వివాహ మంగళకార్యాన్ని నడిపించు’’ అని కోరుకోగా... బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. నగరమంతా అలంకరించారు.
సూర్యచంద్రులు తమ కాంతులచేత ఆ నగరాన్ని అహోరాత్రులు ప్రకాశించేలా చేశారు. కళ్యాణమండపం వద్ద దేవతలు, మునులు అందరూ ఆసీనులై వేదమంత్రాలను ముక్తకంఠంతో చదివారు. మేనాహిమవంతులు కన్యాదానం చేశారు. బ్రహ్మదేవుడు వధూవరులకు పాణిగ్రహణం చేసి, అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణం చేయించారు.
మహామునీంద్రులు వేదాశిస్సులు పలికారు. దేవతలందరు నూతన వధూవరులకు వస్త్రమణిభూషణాదులు కానుకలుగా ఇచ్చారు.
మన్మథ దహనం :
పూర్వం ఒకరోజు పార్వతీపరమేశ్వరులు కలిసి ఒక మేడమీద కూర్చుని వుండగా... కొందరు మహామునులు అక్కడికి చేరుకున్నారు. శంకరుడు వారితో సత్ప్రసంగములు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలోనే మన్మథుడు కూడా రతిదేవితో కలిసి అక్కడికి వచ్చాడు.
సమయాసమయములు గుర్తించకుండా అక్కడికి చేరుకున్న మన్మథుడిని చూసి.. శంకరుడు తన మూడవకన్నుతో అతనిని కాల్చివేశాడు. అలా నిర్జీవుడైన తన భర్తను చూసి.. రతీదేవి, పార్వతీపరమేశ్వరులను దీనంగా ప్రార్థించి.. తన భర్తను సజీవంగా మార్చమని కోరుకుంటుంది.
గౌరీశంకరులు ఆమెను ఓదార్చి.. ‘‘మన్మథుడు ఇంకా శరీరంతో బతికేవున్నాడు. కాని అనంగుడై కూడా అతడు తన పని చేస్తూనే వున్నాడు. శ్రీమన్నారాయణనుడు భూమిలో యదవంశంలో వాసుదేవుడై జన్మిస్తాడు. ఆ శ్రీకృష్ణునకు పట్టమహిషియైన రుక్మిణికి ప్రద్యమ్యుడు అనే పేరుతో నీ భర్త జన్మిస్తాడు. అప్పుడు నువ్వు అతనిని మానవకాంతవై పెళ్లాడతావు. విచారాన్ని మానుకో’’ అని ఆమెను అక్కడి నుంచి పంపివేస్తారు.
పురుషోత్తమ క్షేత్రము :
మహామునులందరూ పురుషోత్తమ క్షేత్రం గురించి వివరించండి అంటూ సూతుడిని కోరుకున్నారు. అప్పుడు సూతుడు దాని చరిత్రను వివరిస్తూ...
‘‘ఒకప్పుడు మేరుపర్వత శిఖరభాగంలో సకలదేవతలు, ముని గణములను సేవిస్తుండగా.. లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు కొలువయ్యారు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్తను చూసి.. ‘‘భూలోకాన్ని కర్మభూమి అని అంటారు. అక్కడ జన్మ లభించడం పుణ్యవిశేషం అని కూడా అంటారు. మరి, అటువంటి భూమిలో జన్మించినవారు కామక్రోధంతో షడ్వర్గాలకు లోనయి వివాహకర్మం చేయడం మానుకుంటున్నారు. ఈ విచిత్రమేమిటో తెలుసుకోవాలని వుంది. దయచేసి చెప్పండి’’ అని కోరుకుంటుంది.
అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు.. ‘‘పురుషోత్తమ క్షేత్రం అనే ఒక పుణ్య క్షేత్రం సముద్రతీరంలో వుంది. అందులో పురుషోత్తముడు నివసించేవాడు. దానికి సమానమైన ఇంకొక క్షేత్రం భూమండలంలోనే లేదు. అక్కడ నా విగ్రహం ఇంద్రాదిదేవతలతో, ఎవ్వరికి కనబడకుండా దాచబడింది. అందువల్ల నదిక్షేత్రంరాజం అని చెప్పబడుతుంది.
కల్పాంత ప్రళయంలో యోగనిద్రలో వెళ్లిపోయిన నేను.. ప్రళయం తరువాత నిద్రనుంచి లేచి, సృష్టిని నిర్మించాలని సంకల్పించాను. నాభికమలం నుంచి బ్రహ్మను సృజించాను. అతడు పంచభూతాలను, వాటినుండి స్థూల, సూక్ష్మ రూపాలైన వస్తుజాలమును సృష్టించాడు. అవి చరములని, అచరములని రెండు విధాలుగా వుండేవి. బ్రహ్మ మళ్లీ ప్రజాపతులను, మునివరులను తన సంకల్పంతో సృజించాడు. అలాగే అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భేదజములుఅనే నాలుగు విధాలైన జవరాసులను సృష్టించాడు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలవారిని, అత్యంజులను, మ్లేచ్ఛులను కూడా సృష్టించాను. వారికి ఆహారంగా తృణగుల్మవృక్షలతాదాలను ఏర్పరిచాడు. తన శరీర దక్షిణభాగం నుంచి పురుషుని, వామభాగం నుంచి స్త్రీని సృష్టించి... వారిని దంపతులు చేసి, సంతానం వృద్ధి చేసుకోమ్మని చెప్పాడు. అప్పటినుంచి స్త్రీపురుష సంగమం వల్ల జీవరాసులు జన్మించే వ్యవస్థ మొదలైంది. నేను విరాడ్రూపుడై ఆయా జీవరాసులలో ఆత్మస్వరూపుడిగా నిలిచి వున్నాను.
ఒకప్పుడు బ్రహ్మ నన్ను చూసి... ‘‘మహాత్మా! ఈ సృష్టిలో అనేకవిధాల స్వభావాలు గలవారు పుడుతున్నారు. కొందరికి పుణ్యకర్మలు చేసే బుద్ధి కలగడం లేదు. అటువంటివారికి స్వర్గాది పుణ్యలోకం ఎలా కలుగుతుందో చెప్పు’’ అని కోరాడు.
నేను.. ‘‘దక్షిణదేశంలో సముద్రతీరాన ఒక వటవృక్షముంది. దాని నీడలో కూర్చున్నవారికి బ్రహ్మహత్యాది దోషాలు నశిస్తాయి. ఆ వృక్షానికి ఉత్తర భాగంలో ఒక మందిరముంది. అందులో ఒక అందమైన విగ్రహాన్ని పరమేశ్వరుడు స్థాపించాడు. దానిని దర్శించుకున్నవారికి మోహం తొలగిపోయి వైకుంఠప్రాప్తి కలుగుతుంది.
ఒకప్పుడు యమధర్మరాజు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, నాకు నమస్కరించి... ‘‘ఓ మహానుభావా! నీకు వందనములు’’ అని వినయంతో పలికాడు. ఆ సమయంలో నేను అతడిని ఇలా అడిగాను.. ‘‘యమధర్మరాజా! దేవతలలో ఉత్తముడవైన నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చావు’’ అని ప్రశ్నించాను.
అప్పుడు యమ.. ‘‘ఈ పురుషోత్తమ క్షేత్రంలో వున్న నీ రూపం, భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చుతోంది. వారు నిన్ను దర్శించి, శ్వేతమనే పేరుగల ఆ దేవాలయాన్ని చూసి, తమ కామక్రోధాలు విడిచి వైకుంఠానికి నన్ను చూడకుండానే వెళ్లిపోతున్నారు. నాకసలు ఎటువంటి పని కూడా వుండటం లేదు. నేను జీవుల పాపపుణ్యాల గురించి విచారించడం తప్ప నేనేం చేయగలను. కాబట్టి నన్ను అనుగ్రహించి పాపులకు ఈ విగ్రహం కనబడకుండా చేయు’’ అని కోరాడు.
అప్పుడు నేను ఆ విగ్రహాన్ని మునిజనులకు తప్ప ఇతరులకు కనబడకుండా ఇసుకలో విగ్రహాన్ని పూడ్చిపెట్టాను. యముడు దానికి సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జగన్నాథుని మీద ఇంద్రుద్యుమ్నుడు చూపిన భక్తి :
మాళవ దేశానికి అధిపతి అయిన ఇంద్రుద్యుమ్నుడు.. అవంతీనగరాన్ని రాజధాని చేసుకుని రాజ్యం చేసేవాడు. అతడు విష్ణుభక్తుడు. రాజ్యంలో వున్నవారందరిని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. వర్ణాశ్రమాచార ధర్మాలు అతని పాలనలో తూచాతప్పకుండా కనబడేవి. పాపాత్ములుగాని, మూర్ఖులుగాని ఆ ప్రాంతంలో కనిపించరు. ఉజ్జయినీ నగరాన్ని మహాకాళడనే పేరుతో పరమేశ్వరుడు ఆరాధించబడుతూ.. పాపాలను పోగొట్టేవాడు.
ఒకనాడు ఇంద్రద్యుమ్నుడు పూర్వ సముద్రతీరంలో వున్న జగన్నాథుని చూడటానికి పురుషోత్తమ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. ముందుగా వటవృక్షరూపంలో వున్న జగన్నాథునికి పూజలు చేసి.. కళింగదేశాధిపతిని, కోసలరాజును పలిపించి.. ‘‘మనం ఇఖ్కడ జగన్నాథుని విగ్రహాన్ని చేయించి, ఆపైన ఆలయాన్ని నిర్మిద్దాం’’ అని చెబుతాడు.
అప్పుడు అక్కడికి ఆగమ శాస్త్ర పండితులను, శిల్పులను పిలిపించి.. ‘‘ఇక్కడ జగన్నాథుని ఆలయాన్ని నిర్మించాలి. మీరందరూ దేశమంతా తిరిగి మేలైన రాళ్లను ఎంచుకుని తీసుకుని రండి’’ అని వారిని పంపిస్తాడు. అలాగే వార్తాహరులను పిలిపించి.. ‘‘మీరు రాజులందరి దగ్గరకు వెళ్లి ఆలయ నిర్మాణం గురించి వివరించండి. ఈ కార్యానికి కావలసిన సహాయం చేయడానికి ఇక్కడికి రావలసిందిగా చెప్పండి’’ అని పంపిస్తాడు.
రాజులందరూ ఈ వార్త వినగానే రాజలాంఛనాలతో, చతురంగబలాలతో పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నారు. వారందరిని ఇంద్రద్యుమ్నుడు చూసి ఆనందించి.. ‘‘ఈ క్షేత్రం చాలా పుణ్యమైంది. అందువల్లే ఇక్కడ జగన్నాథుని ఆలయ నిర్మాణం చేయాలి. అంతకుముందే అశ్వమేధయాగం చేయాలని సంకల్పించాను. కాని కార్యభారముని నేనొక్కడినే చేయడం కష్టం కాబట్టి మీరందరు నాకు సహకరించి పనిని నిర్వహించండి’’ అని అంటాడు.
చక్రవర్తి వారందరిని ఇలా అడగగా వారందరూ చాలా సంతోషించారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలన్ని సమకూర్చారు. యజ్ఞానికి కావలసిన సమస్త ద్రవ్యాలను సమకూర్చారు. దూరదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు, రాజులకు, ఇంకా ఇతర జాతులవారికి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచారు. ఒక సుముహూర్తంలో ఇంద్రద్యుమ్నుడు యజ్ఞదీక్షితుడై, యశ్వాన్ని పూజించి దేశంమీదికి వదిలాడు. అతని కుమారుడు చాలా పరాక్రమవంతులు. వారు ఆ అశ్వానికి వెంటనంటి వెళ్లారు.
అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, ఋత్విజులు వేదమంత్రోచ్ఛారణంతో హోమాలు చేస్తున్నారు. పండితులు శాస్త్రచర్చలు చేస్తున్నారు. ఇలా మహావైభవంతో యజ్ఞం పూర్తి అయింది. చక్రవర్తి అవబృథ స్నానం చేసి, ఇతరదేశాల నుంచి వచ్చిన వారందరిని అపరిమిత ధనంతో సత్కరించాడు. రాజులను గౌరవించి, సంతోష పరిచాడు. యాగం సమాప్తం అయింది.
ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు ఏకాంతంగా కూర్చుని శ్రీజగన్నాథుడిని మనసులో తలుచుకుంటే ఇలా స్తుతించాడు.. ‘‘ఓ జగన్నాథా! సృష్టిలో వున్న ప్రతి అణువు నీ రూపమే. అజ్ఞానులైన మాలాంటి మానవులకు అనేకంగా కనిపిస్తున్నావు. నీ మహిమ గురించి దేవతలే తెలుసుకోలేకపోయారు. మాలాంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? నేను ఇదివరకు ఎన్నో జన్మలెత్తాను. పశుపక్షి, మానవ, క్రమికీటకాలలో ఎన్ని మాతృగర్భంలో పుట్టానో లెక్కలేదు. మానవజన్మం ఎత్తినప్పుడు ఎన్నో శాస్త్రాలను చదవివాను. ఎంతో ధనాన్ని ఆర్జించాను.
జలయంత్రంలా జీవితంలో ఎగుడుదిగుడులు చూశాను. ఇటువంటి సంపారంలో పడి దీనినంతటిని చూడలేక పరితపించాను. నన్ను కనికరించి ఈ సంసారబంధం నుంచి విముక్తిని చెయ్. నాకన్నా సమర్థులు ఇంకెవ్వరూ లేరు. నా జీవిత క్షేమం నీ చేతిలోనే వుంది. నన్ను సేవించని వారు అధములు. వారికి నీమీద భక్తి ఎలా కలుగుతుంది? అందువల్ల నేనెప్పుడు జన్మనెత్తినా నీ నామస్మరణం, నీమీద భక్తిని ప్రసాదించు. ఇలా అడగటం మా వెర్రితనం.. ఇవే నీకు అనంతకోటి ప్రణామములు’’.
ఇంద్రద్యుమ్నుడు చేసిన స్తోత్రానికి జగన్నాథుడు మెచ్చుకుని, ఒకనాటి రాత్రికలలో సాక్షాత్కరించి.. ‘‘ఓ రాజా! నీ భక్తిని, యాగానికి నేను సంతుష్టించాను. నీకొక గొప్ప విషయం చెబుతాను. నువ్వు జగన్నాథుని ప్రతిమను జయించి ప్రతిష్టించదలచావు కదా! రేపు ఉదయాన్నే సముద్రతీరానికి వెళ్లు.. అక్కడ మహావైశాల్యం గల అశ్వత్థవృక్ష ఒకటి కనిపిస్తుంది. దానిని అనుమానించకుండా గొడ్డలితో నరికి పడగొట్టు. ఆ వృక్షాన్ని నరికి, దానునుంచి పెద్దకొమ్మను వేరుచేసి, దానితో జగన్నాథ ప్రతిమను చేయించు. నీ మనసులోవున్న రూపంతోనే ఈ ప్రతిమ తయారవుతుంది. విచారించకు’’ అనిచెప్పి అదృశ్యమయ్యాడు.
రాజు ఉదయాన్నే లేచి, సముద్రస్నానాన్ని ఆచరించుకుని, సముద్రతీరానికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ అశ్వత్థవృక్షాన్ని జగన్నాథుడు చెప్పిన విధంగా నరికాడు. దానిని ముక్కలు చేయబోతుండగా.. అక్కడికి దేవశిల్పి అయిన విశ్వకర్మ, విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషములో వచ్చారు. వారు రాజుతో.. ‘‘సముద్రతీర అడవుల్లో పడివున్న ఈ వృక్షం, నీకేమి అడ్డు వచ్చింది?’’ అని అడిగారు.
అప్పుడు రాజు వారితో.. ‘‘అయ్యా! ఇది జగన్నాథుని ఆజ్ఞ. నేను జగన్నాథుని ప్రతిమను చేయడానికి ప్రయత్నిస్తుండగా.. నిన్నరాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఈ వృక్షాన్ని ఛేదించి, దీని శాఖతో విగ్రహాన్ని చేయించు అని జగన్నాథుడు ఆజ్ఞాపించాడు. అందువల్లే దీనిని నరికాను. ఇంకొక కారణంతో కాదు’’ అని చెబుతాడు.
దాంతో ఆ బ్రాహ్మణులు సంతోషించి... ‘‘రాజా! నీలాంటి ధర్మాత్ముని పాలకునిగా పొందినందుకు ప్రజలు చాలా ధన్యులు. శ్రీనాథుని ఆరాధించినవాడివి. ఇలా రా.. నాతో వచ్చిన ఈ బ్రాహ్మణుడు విశ్వకర్మయంతటి శిల్పి. నువ్వు చెప్పిన విధంగా ఇతడు విగ్రహాన్ని చెక్కుతాడు. నువ్వు ప్రస్తుతానికి ఈ సముద్రతీరాన్ని వదిలేసి దూరంగా వెళ్లు’’ అని వారు చెప్పగా.. రాజు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాడు.
అప్పుడు శ్రీనివాసుడు, విశ్వకర్మను చూసి.. ‘‘నువ్వు ఈ చెట్టుకొమ్మతో జగన్నాథుని ప్రతిమను నిర్మించు. దాంతోపాటు బలరామమూర్తి విగ్రహాన్ని కూడా నిర్మించు. హరికి సోదరి అయిన సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా తయారుచేయు’’ అని చెప్పగా.. విశ్వకర్మ అందుకు అంగీకరిస్తాడు.
విశ్వకర్మ మొదటగా బలరామవిగ్రహాన్ని నిర్మించాడు. రెండవ శ్రీకృష్ణ భగవానుడిది ప్రకాశించేవిధంగా నిర్మించాడు. అలాగే సర్వాలంకారంతో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా చెక్కాడు. ఇంద్రద్యుమ్నుడిని పిలిచి, జగన్నాథుడు ఆ విగ్రహాలను చూపించాడు. సరిగ్గా అతను తలచుకున్నట్టే ఆ విగ్రహాలు చెక్కబడి వున్నాయి. ఎన్నో అలంకారాలతో, స్వల్ప కాలంలోనే విగ్రహాలను నిర్మించినవారికి చూసి పరమాశ్చర్యంతో... ‘‘మహానుభావులారా! అద్భుతమైన తేజస్సు రూపంలో వున్న మీరు ఎవరు? మాయారూపంలో వచ్చిన దేవతలా? మీ వృత్తాంతం గురించి వివరించండి?’’ అని అడిగాడు.
అప్పుడు జగన్నాథుడు.. ‘‘సర్వ వేదాంత రహస్యాల జ్ఞానాన్ని కలిగినవాడిని నేను పరమేశ్వరుడిని. నువ్వు నా భక్తుడివి కనుక నీకు దర్శనమిచ్చాను. నీకొక వరాన్నిస్తాను కోరుకో’’ అని అంటాడు. రాజు ఆ మాటలు విని ఆనందంతో సమస్కారాలు చేసి.. ‘‘దేవా! ఆనందదస్వరూపమై పరమపదంతో నాకు అనుగ్రహించు’’’ అని రాజు కోరుకుంటాడు.
అప్పుడు జగన్నాథుడు.. ‘‘ఇంద్రుద్యమ్నా.. నువ్వు అనేక యజ్ఞాలు, పుణ్యకర్మాలు చేస్తూ ఈ భూచక్రంలో 19వేల సంవత్సరాలు పరిపాలన చేస్తావు. నువ్వు చేసిన ధానదర్మాలతో ఒక మడుగు ఏర్పుడుతుంది. ఆ తరువావత నువ్వు దేవేంద్రాదులకు కూడా పొందని పరమపదాన్ని పొందుతావు.ఇఖ్కడ నైరుతిదిశగా ఒక మర్రిచెట్టుంది. దాని సమీపంలో ఒక దేవాలయం వుంది. రాబోయే ఆషాఢ శుద్దపంచమినాడు నన్ను అక్కడ ప్రతిష్ఠించి ఏడురోజులు పూజాపురస్కారాలు చేయు’’ అని చెప్పగా రాజు చాలా సంతోషించాడు. ఈ చర్మవృక్షులతోనే నేను జగన్నాథుని దర్శించాను. ఇంతకంటే ఏం కావాలి అని భావించి, సుభద్రబలరామకృష్ణ విగ్రహాలను పల్లకిలో పెట్టించి దేవాలయానికి తీసుకుని వెళ్లాడు.
భగవానుడు చెప్పిన సుముహూర్తంలో వేదమంత్రాలతో విగ్రహాలను ప్రతిష్టించి, కళాన్యాసం చేయించాడు. ఆ విగ్రహప్రతిష్టను యథాశాస్త్రంగా నడిపించిన గురువుకి, ఋత్వికులకు బంగారాభరణాలతో పూజించాడు.
పంచతీర్థ మహిమ :
ఇంద్రద్యుమ్నుని పేరుతో వెలిసిన తీర్థాన్ని పంచతీర్థంగా పిలువబడుతోంది. ఈ తీర్థంలో నారాయణనామ స్మరణం చేస్తూ.. అఘమర్షణ స్నానం చేసి, బ్రహ్మయజ్ఞం, దేవ పితృ తర్పణం చేయాలి. ఆ తరువాత జగన్నాథునిని పూజించుకోవాలి. అలా చేయడంతో అతని ఏడుతరాలవారిని, ఆ తరువాత వచ్చే ఏడు తరాలవారిని తరింపజేయాలి. తాను స్వయంగా విష్ణులోకానికి దేవవిమానంపై వెళతాడు.
ఏకాదశినాడు ఉపవాసం వుండి, పైన చెప్పిన కృత్యాలను ఆచరించినా.. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తిథిలో ఆచరించినా విశేష ఫలితాలు లభిస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమా తిథి.. దశవిధపాతకాలను హరిస్తుంది కనుక దానికి ‘‘దశహర’’ అనే పేరు వచ్చింది. సమస్థ తీర్థ జలాలు ఆ పంచతీర్థంలో నివసిస్తాయి కాబట్టి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు స్నాన, ధ్యాన, తర్పణాది కృత్యాలకు విశేస ఫలప్రదం లబిస్తుందని అందరూ విశ్వసిస్తారు.
కండు మహర్షి చరిత్ర :
సూతుడు.. పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి చెబుతూ... ఒక ఇతిహాసాన్ని మునులకు ఈ విధంగా చెబుతాడు...
‘‘కండు అనే మహర్షి ఒక అరణ్యంలో తపము చేస్తుండేవాడు. ఆయన వేదవేదాంగ విశారదుడు. ఆయన శరీరం క్షణభంగురమని తెలిసిన వేదాంతి. అందువల్ల ఆయన పురుషోత్తముడైన జగన్నాథునిని మనసులో నిలిపి, ప్రపంచంలో వున్న సమస్త విషయాలను విడిచిపెట్టి, నిష్ఠతో తపము చేసేవాడు.
అతని తప: ప్రభావానికి దేవేంద్రుడు భయపడి.. దానిని చెరిపించాలనే ఉద్దేశ్యంతో... ప్రమ్లోచన అనే ఒక అప్సరసను పిలుస్తాడు. ఆమెతో.. ‘‘నువ్వు వెళ్లి ఆ కండు ముని తపస్సును పాడుచేసి రా’’ అని చెబుతాడు. కానీ ముని ఎక్కడ శపిస్తాడేమోనన్న భయంతో ఆ అప్సరస దేవేంద్రుడితో.. ‘‘దేవేంద్రా! రంభాద్యప్సరసలు నాకంటే అందంగా వున్నారు. నేనెంత నా సౌందర్యమెంత? వారిని పంపించవచ్చు కదా!’’ అని చెబుతుంది.
దానికి సమాధానంగా దేవేంద్రుడు.. ‘‘నీవల్లే ఈ కార్యం కొనసాగుతుంది. నీకు సహాయంగా మన్మథునిని, వసంతునిని పంపిస్తున్నాను. వెళ్లి పని సాధించు’’ అని పంపగా... ఆమె కండుముని తపము చేసే ప్రాంతానికి బయలుదేరుతుంది.
కండు మహర్షి తప: ప్రభావంతో ఆ వనంలో వున్న జంతువులు మైత్రితో జీవనాన్ని కొనసాగించేవి. వృక్షాలు, ఫలపుష్ప సంభరితమై కనులపండుగగా వుండేవి. అక్కడికి వచ్చిన ప్రమ్లోచన కూడా ఆ వనసౌందర్యానికి ముగ్దురాలయిపోతుంది. ప్రకృతి మనోహరంగా వుండే సమయంలో ఆమె ఒక పూలచెట్టు కింద కూర్చుని.. లోకాలు పరవశించేటట్లుగా గానం చేస్తుండేది. మదన, వసంతులు ఆమెకు తోడుగా అక్కడే వున్నారు.
కండుముని ప్రాతస్సంధ్యావందనం కోసం లేచాడు. గానం శ్రుతి మనోహరంగా వినిపించిన మునికి.. ప్రమ్లోచన వద్దకు వెళతాడు. అక్కడ అతను, ఆమెతో.. ‘‘నువ్వు ఎవరు? నువ్వు వచ్చిన పని ఏమి?’’ అని ప్రశ్నిస్తాడు.
అందుకు ఆమె సమాధానంగా.. ‘‘ఓ మునివరా! నీ సేవ చేసి తరించడానికి వచ్చాను. నీకెప్పైడైనా, ఏమైనా కావాలంటే చెప్పినా.. అవన్ని సిద్ధంగా అమర్చి ఇస్తాను’’ అని అంటుంది.
ఆ సమయంలో అక్కడే వున్న మన్మథుడు ముని హృదయంలో పూలబాణాలు నాటుతాడు. వసంతుడు అతనిపై పూలజల్లు కురిపిస్తాడు. దాంతో ముని మనసు అప్సరసపై లగ్నమైపోతుంది. ముని ఆమె చెయి పట్టుకుని, తన మనసులో వున్న భావాన్ని చెప్పి.. ఆశ్రమ కుటీరానికి తీసుకుని వెళతాడు.
తాము వచ్చిన పని పూర్తయిందన్న సంతోషంతో మదన, వసంతులు స్వర్గలోకానికి తిరిగి వెళ్లిపోతారు. అక్కడికి వెళ్లి ఇంద్రునికి ఈ విషయం గురించి మొత్తం చెబుతారు. దాంతో ఇంద్రుడు చాలా సంతోషిస్తాడు.
కండు ముని, ప్రమ్లోచనతో రాత్రి, పగలు అని తేడా లేకుండా నూరు సంవత్సరాలపాటు భోగసారాలు అనుభవించాడు. మునివేషంలో వుండటం వల్ల ఆమె ఇతనిని అసహ్యించుకుంటేదేమోనని.. యితపశ్శక్తిని ఖర్చచేసి యౌవనరూపాన్ని ధరించి.. ఆమెతో సుఖంగా వుండేవాడు.
వంద సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె.. ‘‘ఇక నేను స్వర్గ పట్టణానికి వెళతాను. సెలవివ్వండి’’ అని అడుగుతుంది. దాంతో అతడు.. ‘‘ఇంకొంత కాలం ఇక్కడే వుండు’’ అని కోరుకుంటాడు. ముని మాటకు ఎదురు చెప్పలేక ఆమె అతనితోనే వుండిపోతుంది. దాంతో ముని తపస్సు చేయడం మరిచిపోయి... దేవతారాధనాలు, స్నానాలు, సంధ్యలు, జపములు, వేదాపారాలన్ని మూలబడతాయి.
అలాగే ఇంకా వందేళ్లు గడిచిన తరువాత కూడా ఆమె వెళతానంటే.. ముని వద్దంటూ తన దగ్గరే వుండమంటాడు. ఒకనాడు సాయంకాలం కండుముని, ప్రమ్లోచనతో.. ‘‘ఓ వనితామణీ! సాయంకాలం అవుతోంది. సంధ్యవార్చి వస్తాను. ఉదయం నుంచి నీతోనే సరిపోయింది’’ అని అంటాడు.
ముని చెప్పిన మాటలు విని ప్రమ్లోచన నవ్వుతుంది. అతనితో.. ‘‘ఇప్పుడు సంధ్య వార్చెదవా? ఇటువంటి సాయంకాలాలు ఎన్ని గడిచాయో తెలుసా?’’ అని అడుగుతుంది. అతడు.. ‘‘నువ్వు ఈ ఉదయమేగా వచ్చావు. ఇంతలో నన్ను ఎందుకు హాస్యమాడుతున్నావు? అని అంటాడు.
అప్పుడు ఆమె అతనిని చూసి.. ‘‘మునీంద్రా! నిజం చెబుతున్నాను విను. నువ్వు నన్ను ప్రభావవేళ చూసింది నిజమే. అది ఎన్ని సంవత్సరాల కింద మాట తెలుసా? ఈ మధ్యలో తొమ్మిదివందల ఏడేళ్లు.. ఆపైన ఆరు మాసాలు.. ఆపైన మూడురోజులు కూడా అయిపోయాయి’’ అని చెప్పగానే.. కండు ముని ఒక్కసారిగా ఆశ్చర్యంగా వుండిపోతాడు.
ముని ఆమెతో.. ‘‘నువ్వు హాస్యం పొందుటకోసం అసత్యం చెప్పడం లేదు కదా?’’ అని ప్రశ్నించాడు. ఆమె.. ‘‘నిజమే చెబుతున్నాను’’ అని, ముని ఏమంటాడోనన్న భయంతో గడగడ వణికిపోతుంది. కానీ కండుముని ఆమె చెప్పింది విని, సిగ్గుపడుతూ.. ‘‘ఎంతటి వారికైనా కామక్రోధాలను విడవడం సాధ్యం కాదు’’ అని అంటాడు.
అలాగే ముని.. ‘‘ఓ తరుణీ! అతనిని జయించినవాడే భగవంతునిని చూడగలుగుతాడు. ఇదంతా నీ అవివేకంతో జరిగింది. తపము, స్వాధ్యాయము, నిత్య కర్మానుష్ఠానాలు అన్ని చెడిపోయాయి. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఇంద్రుడు చెప్పినట్టుగా నీ పనిని నెరవేర్చావు. ఇక నువ్వు నీ స్వర్గానికి వెళ్లు. నిన్ను శపించడం నాకు మనసొప్పదు. నువ్వు నాతో ఇంతకాలం కలిసి వున్నావు. అందులో నీవు దోషం ఏమీ లేదు. ఇదంతా నా దోషమే. వెళ్లు’’ అని అంటడు.
దాంతో ఆమె తనలో వున్న భయాన్ని వదిలేసి, చెమటలతో కూడిన తన శరీరాన్ని వృక్షచిగుళ్లతో తుడుచుకొని, ఆకాశమార్గం ద్వారా అమరావతి చేరుకుంది. ముని ఆమె గర్భంలో వదిలిన తేజం.. చెమట రూపంలో వృక్షాలకు అంటుకుని.. వాటినుంచి మారిషయ అనే కన్య పుట్టింది. ఆ మారిష ప్రతేతసులనే వారిని పెళ్లి చేసుకుని, దక్షుడు అనే కుమారున్ని కనింది.
పశ్చాత్తాపంతో వేగిపోతున్న కండుముని, తన తపశ్శక్తి తిరిగి సంపాదించుకోవడం కోసం పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, పురోషోత్తమునిని దర్శించికుంటాడు. ఆ సమీపంలోనే ఉర్థ్వబాహుడై, మహాతపము చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం ఇలాగే తీవ్రంగా తపము చేయగా.. మనోహర నీలవర్ణ దేహంతో, దివ్యమైన శరీరకాంతితో జగన్నాథుడు ప్రత్యక్ష్యమయ్యాడు.
తన ఎదుట సాక్షాత్కరించిన జగన్నాథుని చూసి కండుముని.. ‘‘ఓ పుండరీకాక్షా! నువ్వు నన్ను అనుగ్రహించడం వల్ల నా తపస్సు ఫలించింది. నా జన్మం సార్థకమైంది’’ అంటూ.. ఆ పరమేశ్వరుడిని స్తుతిస్తాడు.
అప్పుడు ఆ జగదీశ్వరుడు.. ‘‘మునిరాజా! పరమభక్తిభావంతో నువ్వు చేసిన తపస్సుకు నేను మెచ్చుకున్నాను. నన్ను సేవించిన వారెవ్వరైనా నా పరమపదం పొందుతారు. అటువంటప్పుడు బ్రాహ్మణుడివి, వేదవేదాంగవేత్తవయిన నీకు ప్రసన్నం కావడం ఆశ్చర్యమేమి? నీకు ఏ వరం కావాలో కోరుకో’’ అని అంటాడు.
దాంతో ముని.. ‘‘కరుణా! నేను ఈ అశాశ్వతమైన ప్రపంచంలో భోగాలు కోరి కాలం వ్యర్థం చేశాను. అదంతా స్వప్నంలాగా నశించింది. శాశ్వదమైన పరమపదం పొందాలని కోరుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు’’ అని కోరగా.. జగన్నాథుడు కండుమునికి మోక్షం కలిగింగాడు.
శ్రీకృష్ణ చరిత్ర :
ద్వాపరయుగంలో కాలనేమి వంటి రాక్షసులు భూమిమీద రాజులుగా జన్మించారు. వారు ధర్మమనే పేరుతో అధర్మాన్ని ఆచరించి, ప్రజాపాలనకు పీడ చేస్తుండేవారు. ఇది భరించలేని భూదేవి ఒకప్పుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి.. ‘‘నేను ఈ దుష్టులవల్ల కలిగే భారాన్ని భరించలేకపోతున్నాను. దీనికేదైనా ఉపాయం చెప్పండి’’ అని అడుగుతుంది.అప్పుడు బ్రహ్మ, భూదేవితో.. ‘‘దేవతా గణాలతో శ్రీహరి వద్దకు వెళ్లు. ఆయనే దీనికి పరిష్కారమార్గం చెప్పగలుగుతారు’’ అని చెబుతాడు. దీంతో భూదేవి, శ్రీమన్నారాయణుడి దగ్గరకు చేరుకుని తన కష్టాలను వివరిస్తుంది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ, తన తలలోని రెండు కేశాలను లాగి.. ‘‘ఈ రెండు బలరామ, కృష్ణులుగా అవతరించి నీ భూభారాన్ని తగ్గిస్తాయి’’ అని చెప్పి పంపుతాడు.
శ్రీహరి మాయాదేవిని పిలిపించి.. ‘‘ఓ దేవీ! హిరణ్యకశిపుని కుమారులు, ప్రహ్లాదుని తరువాత తరువాత పుట్టినవారు ఆరుగురుమంది ఆనాడు నా ఆజ్ఞతో పాతాళానికి వెళ్లారు. వారిని దేవకీదేవి తొలి ఆరుగర్భాలలో వుంచు. వారందరూ కంసునికి బలి అవుతారు. ఆమె ఏడవ గర్భంలో అనంతుడు ప్రవేశిస్తాడు. నువ్వు ఆ గర్భాన్ని ఆకర్షించి.. నందుని ఇంటవున్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. అప్పుడు దేవకీ ఏడవ గర్భం వ్యర్థమయిందని అందరూ అనుకుంటారు. తరువాత దేవకీ ఎనిమిదవ గర్భంలో నేను ఉదయిస్తాను. నువ్వు యశోదాదేవి గర్భంలో పుట్టి, రేపల్లెలో వున్న వారందరినీ నీ మాయలో ముంచెత్తు. వసుదేవుడు నన్ను నీ స్థానంలో వుంచి, నిన్ను దేవకి దగ్గరకు తీసుకెళతాడు. కంసుడు వధించడానికి వచ్చినప్పుడు నువ్వు అతని చేతికి దొరకకుండా గ్రామదేవతా రూపంలో భూమిలో పూజిస్తూ వుండు’’ అని చెప్పగా.. ఆమె దానికి అంగీకరించి, తన పని మీద వెళుతుంది.
ఈ విషయం గురించి తెలిసిన నారదుడు, కంసుని దగ్గరకు వెళ్లి అతనితో.. ‘‘నీ చెల్లెలు దేవకికి ఎనిమిదవ గర్భంలో నారాయణుడు పుట్టి, నీకు మృత్యుకారణం అవుతాడు’’ అని చెబుతాడు. దాంతో కంసుడు, దేవకీదేవిని చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు.. ‘‘పుట్టిన బిడ్డలను నీకు అప్పగిస్తాను. నువ్వు వారిని వశంలో పెట్టుకో’’ అనగా.. కంసుడు వీరిద్దరిని కారాగృహంలో బంధిస్తాడు. దేవకికి వరుసగా ఆరుగురు కొడుకులు పుడతారు. ఆ పిల్లల్ని వసుదేవుడు, కంసునికి ఇవ్వగా.. అతను కరుణలేకుండా ఆ పిల్లల్ని చంపాడు. ఏడవసారి దేవకికి గర్భస్రావమవుతుంది. ఆ గర్భాన్ని మాయాదేవి, రోహిణి గర్భంలోనికి ఆకర్షిస్తుంది. ఎనిమిదవసారి దేవకికి గర్భం వస్తుంది. గర్భస్థుడైన శ్రీహరిని బ్రహ్మాదులు స్తుతించారు.
శ్రావణమాసంలోని బహుళాష్టమినాడు రాత్రి దేవకి ప్రసవిస్తుంది. అప్పుడు శ్రీహరి జన్మిస్తాడు. దేవకీ, వసుదేవులు ఆ పరమపురుషుని స్తుతించారు. దేవకి, ‘‘నువ్వు బాలకుని రూపంలో మాకు దర్శనమివ్వు’’ అని కోరగా.. అతడు బాలకుడయ్యాడు. మాయా ప్రభావంతో అందరూ ఆ సమయంలో గాఢనిద్రలో వుండిపోతారు. వసుదేవుడు బాలుడిని తీసుకొని రేపల్లెకు పోవుతుండగా.. మధ్యలో యమునానది, మహావర్షం కురుస్తుంది. బాలకునిపై వర్షం పడకుండా శేషుడు తన పడగలను విప్పుతాడు. రేపల్లెలో కూడా అందరూ గాఢనిద్రలో వుండగా.. యశోధ ప్రసవిస్తుంది. అప్పుడు వసుదేవుడు ఈ బాలుడిని యశోధ పక్కలో వుంచి, ఆ మాయ బాలికను తీసుకొని వచ్చి దేవకికి ఇస్తాడు.
ఆ సమయంలో కావలివారు మేలుకొని, విషయం మొత్తం కంసునికి తెలుపుతారు. అతను బాలికను చంపబోతుండగా దేవకి.. ‘‘ఇది ఆడపిల్ల కదా! దీని వల్ల నీకు ఏ కీడు వుంటుంది? పురుషుడైతే కీడు కలుగుతుందని అనుకోవచ్చు. కాబట్టి ఈ బాలికను వదిలేయ్’’ అని ఏడుస్తుంది. అయినా కంసుడు ఆ బాలికను చంపబోతుండగా... ఆమె ఆకాశంలో ఎగిరి.. ‘‘నీకు మృత్యువు తప్పదు. నిన్ను చంపేవాడు పుట్టాడు’’ అని చెప్పి అదృశ్యం అవుతుంది. అప్పుడు కంసుడు.. దేవకీ, వసుదేవతలతో ‘‘నేను చేసిన ప్రయత్నాలన్ని వ్యర్థమయ్యాయి. మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి’’ అని వారిని విడిచిపెట్టి, మర్యాదలు చేస్తాడు.
శ్రీకృష్ణుని బాల్యక్రీడలు :
శ్రీకృష్ణుడు, బలరాముడు నందుని పల్లెలో వుండేవారు. శ్రీకృష్ణుడు.. తనకు పాలిచ్చి చంపబోయిన పూతన ప్రాణాలను తీస్తాడు. తనమీదికి రాబోయిన శకటాసురునికి చంపేస్తాడు. తనను గాలిలోకి ఎత్తుకునిపోయిన తృణావుర్తునిని సంమరిస్తాడు. ఈ ఘటనలను చూసిన నందాదుల ప్రజలు భయపడిపోయి, రేపల్లె విడిచిపెట్టి యమునానదీ తీరంలో వున్న బృందావనానికి వలస వెళ్తారు.
కృష్ణుడు తన తోటి పిల్లలతో కలిసి.. గొల్లవారి ఇళ్లలోకి దూరి పాలు, పెరుగు, వెన్నలను దొంగలించి తినేవాడు. తనతోపాటు వచ్చిన పిల్లలకు కూడా పంచిపెట్టేవాడు. ఇలా ప్రతిరోజు చేయడ వల్ల.. ఇతని ఆగడాలు భరించలేక గోపికలు వచ్చి యశోదతో చెబుతారు. దాంతో ఆమె కృష్ణునిని రోటికి కట్టివేయగా.. దానిని ఈడ్చుకుంటూ రెండు మద్ది చెట్ల మధ్యనుంచి లాగి ఆ మద్దలను కూలగొడతాడు. దీంతో మద్దులరూపంలో వున్న గంధర్వులకు శాపవిమోచనం కలుగుతుంది.
గోవులను గాచుటకు వెళ్లి, యమునానది మడుగులో వున్న కాళియునిని మర్దించి, అతనిని సముద్రానికి తరిమేశాడు. యమునా జలాన్ని స్నానపానాలకు యోగ్యంగా మార్చాడు. బలరాముడు తాళవనంలో ప్రవేశించి ధేనుకాసురుడిని సంహరించి.. గోపబాలురతో తాటిపళ్లు తినిపించాడు. కృష్ణ, బలరాములు ఇలా ఒక్కొక్కరుగా చాలామంది రాక్షసులను చంపారు. ఆవుదూడలకు, గోపబాలకులను బ్రహ్మ దాచివేగా.. కృష్ణుడు ఒక సంవత్సరంవరకు బాలురుగా, దూడలుగా రూపమెత్తి.. తనేమిటో తెలియజేస్తాడు.
కృష్ణుని జీవిత విశేషాలు :
కంసుడు ధనుర్యాగంతో పేరుతో పిలవబడ్డ అక్రూరునితో కృష్ణ, బలరాములు వెళ్లారు. కృష్ణుడు కుబ్జ నుంచి గంధాదులను గ్రహించి.. ఆమెను అనుగ్రహించాడు. ధనుశ్శాసనాలకు వెళ్లి.. ధనస్సును విరిచాడు. కంసుని సభాభవనానికి వెళ్లి.. బలరాములు చాణూర ముష్టికులను, మల్లవీరులను మట్టికరిపించారు. కృష్ణుడు, కంసుడిని సింహాసనంపై నుంచి లాగి కిందకుపడేసి చంపాడు. తనకు తాత అయిన ఉగ్రసేనుని రాజుగా చేశాడు. దేవకీ, వసుదేవలను ఆదరంగా గౌరవించాడు.
కృష్ణుడు అన్నతో కలిసి సాందీపని అనే ఒక మునీంద్రుని నుంచి వేదవేదాంగాలను ఒక్కసారి విని నేర్చుకున్నాడు. రాజనీతిని, ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. వీరి ప్రభావాన్ని చూసి స్వయం గురువే ఆశ్యర్యపోయాడు. తనపై దండెత్తిన జరాసంధాదులను చాలాసార్లు ఓడించాడు. ధర్మరాజు ద్వారా రాజసూయం చేయించాడు. ఎదిరించిన రాజులను పాండవుల సహాయంతో అణిచివేశాడు. తనను వరించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకుని వచ్చి.. ఆమెతో పెళ్లి చేసుకున్నాడు.
జాంబవంతుని గెలిచి, శ్యమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామను, జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇంకా ఐదుగురు మిత్రవిందాదులను వివాహం చేసుకున్నాడు. ఇంద్రుని కోరికపై నరకాసురునిని చంపి.. అతని చెరలో వున్న పదహారువేలమంది కన్యలను విడిపించాడు. తాను అన్ని రూపాలను ధరించి, ఆ కన్యలతో పరిణయమాడాడు.
ప్రద్యుమ్నుడు :
రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు. అతడు పుట్టగానే శంబరుడు అనే రాక్షసుడు.. అతనిని ఎత్తుకుని పోయి, చంపాలనే నెపంతో సముద్రంలో పడేస్తాడు. అతడు చచ్చిపోయాడని సంతోషించి.. ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చేప మింగుతుంది. అయినా అతను చావలేదు. ఒకరోజు జాలరులు చేపలు పట్టుకుంటుండగా.. ఈ చేప వారి వలలో పడుతుంది. ఈ పెద్ద చేపను వారు తమ రాజు అయిన శంబరునికి కానుకగా సమర్పిస్తారు.
శంబరుని రాజుకు మాయావతి అనే భార్య వుండేది. ఆమె ఆ రాజ్యానికి రాణి అయినప్పటికీ, ఇంట్లో అన్ని పనులు తానే చేసుకునేది. జాలరులు, శంబరునికి కానుకగా ఇచ్చిన చేపటను వండటానికి లోనికి పంపిస్తాడు. ఆ చేపను కోయగా.. అందులో బాలుడు కనిపిస్తాడు. ఆమె ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోగా.. నారదుడు అక్కడికి చేరుకుని, ‘‘ఇతడు రుక్మిణి కొడుకు. ఇతనిని నీ భర్త సముద్రంలో పడవేయగా.. చేప మింగింది. ఇప్పుడు వీడు నీకు దొరికాడు. శ్రద్ధగా ఇతనిని చూసుకుంటూ.. పెంచుకో’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
మాయావతి ఆ బాలుడిని పెంచుకుంటుంది. క్రమంగా అతడు పెరిగి పెద్దవాడయిపోతాడు. ఒకరోజు మాయావతి అతనిని మోహించి, దానికి తగినట్లుగా ప్రవర్తిస్తుంది. అది చూసిన ప్రద్యుమ్నుడు.. ‘‘నువ్వు నన్ను పెంచిన తల్లివి. తల్లి ప్రేమ చూపించకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?’’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆమె, అతని తల్లి గురించి, అతనితో జరిగిన వృత్తాంతం గురించి వివరిస్తుంది. అలాగే శంబరునిని చంపి, తనను పరిగ్రహించమని అతనికి అన్ని విద్యలు నేర్పిస్తుంది. మాయా విశేషాల గురించి బోధిస్తుంది.
ఇలా ఈ విధంగా విద్యను అభ్యసించిన ప్రద్యుమ్నుడు, శంబరునిని యుద్ధానికి పిలుస్తాడు. ఆ యుద్ధంలో అతని సైన్యంతో సహా అందరిని సంహరిస్తాడు. తరువాత అతను మాయాదేవితో కలిసి ద్వారకా నగరానికి వెళతాడు. రుక్మిణి మొదట అతనిని చూసి గుర్తించలేకపోతుంది. అప్పుడు కృష్ణుడు, నారదుడు అక్కడికి చేరుకుంటారు. నారదుడు.. ‘‘తల్లీ! ఇతడు నీ కుమారుడు. నీ ఇంటినుంచి శంబరుడు ఇతనిని ఎత్తుకుపోయి చంపబోగా.. ఈమె సంరక్షించి పెంచింది’’ అని చెబుతాడు.
అప్పుడు రుక్మిణి..‘‘ఈమె శంబరుని భార్య కదా! ప్రద్యుమ్నుడు ఈమెను ఎలా వివాహమాడుతాడు. పైగా ఈమె అతనిని పెంచి పోషించింది కదా!’’ అని శంకిస్తుంది. దీంతో నారదుడు.. ‘‘పూర్వజన్మలో ప్రద్యుమ్నుడు మన్మథుడు. మాయావతి రతిదేవి. ఈమె, ప్రద్యుమ్నుడిని అపహరించిన మాయావి శంబరుడిని తన మాయలో పడేసి.. అతనికి భార్యగా తన మాయారూపంలో సంచరించింది. తన నిజరూపంతో ప్రద్యుమ్నుడిని పెంచి, వరించింది. అందువల్ల ఈమెను కోలిగా స్వీకరించు’’ అని చెప్పగా.. రుక్మిణి, తన కొడుకుని, కోడలిని ఆదరించి ఆహ్వానిస్తుంది.
--from teluguwishesh
EXCELLENT
ReplyDelete