ఊర్వశి, అర్జునున్ని ఎందుకు శపించింది?

, , No Comments


పూర్వం మహా శివుడు, పరాక్రమవంతుడైన అర్జునుని విలువిద్యలను పరీక్షించాలని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ నేపథ్యంలో శివుడు మహా కిరాతుకుని రూపంలో అర్జునుని మీద దాడి చేస్తాడు. అర్జునుడు అతనిని చూసి భయపడకుండా తన శక్తితో యుద్ధానికి దిగుతాడు. దీంతో శివుడు అర్జునుని శక్తియుక్తులను చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనికి బహుమతిగా పాశుపతాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు. అలాగే అర్జునుని లీలలను ప్రశంసిస్తూ ఇంద్రుడు, వరుణుడు, ముడు, కుబేరుడు కూడా అతనికి దివ్య అస్త్రాలను ఇస్తారు. ఆ శుభసందర్భంలోనే అర్జునుడు స్వర్గలోకానికి వెళతాడు.

అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లగానే అక్కడ దేవతలందరూ ఇతనికి ఘనస్వాగతం పలుకుతారు. అతిధి మర్యాదలు నిర్వహించి ఇతనికోసం నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నృత్య ప్రదర్శనలో స్వర్గలోకంలోనే అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి ఎంతో అద్భుతంగా నాత్యం చేసి అందరినీ మెప్పిస్తుంది. ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడు కూడా కనురెప్పలను ఆర్పకుండా నిర్ఘాంతమయిపోయి, అలాగే చూస్తూ వుండిపోతాడు. అర్జునుడిని ఆ విధంగా గమనించిన ఊర్వశి కూడా సంతోషంతో ముగ్ధురాలయిపోతుంది. తన మోహంలో అర్జునుడు కూడా ముగ్ధుడయిపోయాడని ఆమె భావిస్తుంది.

ఇలా నృత్య ప్రదర్శన అయిపోయిన తరువాత అర్జునుడు సేద తీర్చుకోవడానికి తన గదిలో తూగుట ఊయలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. అదే సమయంలో ఊర్వశి అక్కడికి చేరుకుంటుంది. ఆమెను చూడగానే అర్జునుడు విధేయతతో లేచి, ఆమె ముందు నిలబడతాడు. అర్జునుని మోహంలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సిగ్గుపడుతూ.. "అర్జునా! నీ చూపులు చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. నేను కూడా నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నీ గురించి, నీ ధైర్యపరాక్రమల గురించి అందరి ద్వారా ఎంతగానో విన్నాను. అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎలాగైనా సంతోష పెట్టాలని ఇక్కడికి వచ్చాను" అని అంటుంది.



ఊర్వశి చెప్పిన మాటలకు అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి... కొద్దిసేపటివరకు ఆలోచనలో పడిపోతాడు. ఆమెకు సమాధానంగా... "తల్లీ! నీ మాటలు నన్ను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు. నువ్వు మా వంశస్థుడైన పురూరడివి భార్యవి.. అంతేకాకుండా ఇంద్రునికి ఇష్టసఖివి.. అలా చూస్తే నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అటువంటిది నువ్వు నన్ను, నేను నిన్ను మోహించడం అనైతికం. దయచేసి నీ మనసులో వున్న ఆలోచనలను తొలగించేసుకుని, ఇక్కడి నుంచి వెళ్లిపో" అని చెబుతాడు.

అర్జునుడు ఇన్నేసి మాటలన్నా ఊర్వశి వాటిని పట్టించుకోకుండా తనను నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. "దేవలోకంలో ఇటువంటి నీతులు, బంధాలు వుండవని... అప్సరసలు వుండేదే అందరినీ ఆనందింపచేయడానికి" అని చెబుతుంది. అయితే అర్జునుడు మాత్రం ఆమె మాటలకు, సౌందర్యానికి లొంగకుండా.. "నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు నీ సౌందర్యం మీద మోహించదు. నేను నిన్ను అంగీకరించలేను. నువ్వు నాకు తల్లితో సమానం" అని పేర్కొంటాడు.

అర్జునుడి మాటలతో ఊర్వశి కోపం అవధులు లేకుండా దాటిపోతుంది. ఆవేశంతో రగిలిపోతూ.. "ఓరీ అర్జునా! ఈ దైవలోకంలో నన్ను ప్రతిఒక్కరు మోహించినవారే వున్నారు కానీ... ఎవ్వరూ నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు. నాకు నేనుగా నిన్ను మోహించడానికి కోరుకుంటే.. నువ్వు నాతో ఇలా మాట్లాడుతావా..! ఈ పరాభవాన్ని నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంతగా అవమానించిన నీకు ఏదో ఒక శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు నన్ను మోహించలేదు కాబట్టి కొన్నాళ్లవరకు నపుంసకుడిగా జీవిస్తావు. నీ ధైర్యసాహసాలకు భిన్నంగా ఆడవాళ్లతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇదే నేను నీకు విధించే శాపం" అని చెబుతుంది.



అలా ఆ విధంగా అప్సరస ఊర్వశి, అర్జునునికి శాపం ఇచ్చిన కారణంగా ఒక ఏడాదిపాటు నాట్యాచారుడు బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. మహిళలతో కలిసి జీవించాల్సి వచ్చింది. అయితే ఈ శాపమే అతనికి ఒక విధంగా కొన్ని సందర్భాలలో వరంగా కూడా మారింది.

0 comments:

Post a Comment